Delhi | న్యూఢిల్లీ, మే 29: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. 16 ఏండ్ల యువతిని 20 ఏండ్ల యువకుడు అందరూ చూస్తుండగా 21 సార్లు కత్తితో పొడిచాడు. ఇంకా ఆమె మరణించలేదన్న అనుమానంతో అత్యంత క్రూరంగా ఆమె తలను బండరాయితో మోది దారుణంగా హత్య చేశాడు. రోహిణి ప్రాంతంలోని షాహబాద్ డెయిరీలోని ఒక వీధిలో ఈ ఘటన జరిగింది. మారణాయుధంగా వాడిన కత్తి ఒక దశలో ఆమె పుర్రెలో ఇరుక్కుపోయింది. దీంతో అతడు బండరాయిని తీసుకువచ్చి ఆమె తలపై ఐదుసార్లు మోది దారుణంగా హత్య చేశాడు. దారిన పోయేవారు ఈ దృశ్యాన్ని చూస్తున్నారే తప్ప ఆపేందుకు ప్రయత్నించలేదు. నిందితుడిని సాహిల్‌గా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న అతడిని యూపీలోని బులన్షహర్లో అరెస్ట్ చేసినట్టు చెప్పారు. నిందితుడు ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్నాడన్నారు. ముందు రోజు సాయంత్రం ప్రేమికులిద్దరూ ఏదో విషయమై గొడవపడ్డారని పోలీసులు తెలిపారు.
ఆదివారం సాయంత్రం ఆ బాలిక తన స్నేహితురాలి కుమారుడి పుట్టిన రోజుకు వెళ్తుండగా నిందితుడు సాహిల్ ఆమెను విచక్షణా రహితంగా హత్య చేశాడు. అనంతరం పరారయ్యాడు. తన కుమార్తెను హత్య చేసిన సాహిల్‌ను ఉరితీయాలని మృతురాలి తల్లి డిమాండ్ చేసింది. స్థానికులు కలుగజేసుకుని ఆపితేనే ఇలాంటి హత్యలు ఆగుతాయని ప్రత్యేక పోలీస్ కమిషనర్ దీపేంద్ర పాఠక్ అభిప్రాయపడ్డారు.
ఎల్జీ సార్.. ఏదన్నా చేయండి: కేజ్రీవాల్
రాజధానిలో బాలికను దారుణంగా హత్య చేయడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. శాంతిభద్రతల పర్యవేక్షణ బాధ్యత ఎల్జీ చేతుల్లో ఉంటుందని, కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌ను ఆయన డిమాండ్ చేశారు. మహిళలకు ఢిల్లీ ఎంతమాత్రం సురక్షిత ప్రదేశం కాదని ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్ వ్యాఖ్యానించారు.