జమ్మూ: శ్రీనగర్-జమ్మూ హైవేను గత మూడు వారాల నుంచి బంద్ చేశారు. కొండచరియలు విరిగిపడిన తర్వాత ఆ రహదారిని ఆపేశారు. దీంతో అక్కడ వేల సంఖ్యలో ట్రక్కులు నిలిచిపోయాయి. కశ్మీర్ యాపిల్స్(Kashmir Apples)ను ట్రాన్స్‌పోర్టు చేస్తున్న ఆ వాహనాలు ఆగిపోవడంతో.. వాటిల్లో ఉన్న యాపిల్ పండ్లు మురిగిపోతున్నాయి. హైవేపై వందల సంఖ్యలో ఉన్న ట్రక్కుల్లో యాపిల్ డబ్బాలు ఉన్నాయని, వాటిల్లో సుమారు 500 నుంచి 700 కోట్ల ఖరీదైన యాపిల్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కశ్మీర్ నుంచి యాపిల్స్‌తో వెళ్తున్న ఓ సరుకు రావాణా రైలును ఇటీవల ప్రారంభించడంతో.. ట్రక్కుల్లో వ్యాపారం చేస్తున్న వాళ్లు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
యాపిల్స్‌ను సరఫరా చేసేందుకు ట్రైన్ సర్వీస్‌ను ప్రారంభించడాన్ని స్థానికులు స్వాగతించారు. కానీ రోడ్డు మార్గానికి ఇది ప్రత్యామ్నాయం కాదన్నారు. పీక్ సీజన్లో ప్రతి రోజు సుమారు వెయ్యి ట్రక్కులు యాపిల్ లోడ్‌తో వెళ్తాయని, పార్సిల్ రైలులో ఇంత లోడ్‌ను తీసుకెళ్లడం కుదరదని స్థానికులు అంటున్నారు. మంగళవారం రోజు మరో పార్సిల్ రైలు బయలుదేరనున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
హైవేను మూసివేసి ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నారని యాపిల్ పంట రైతులు ఆరోపిస్తున్నారు. యాపిల్స్ పండించేవాళ్లు, ట్రాన్స్పోర్టర్లు, కొనుగోలు దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు స్థానిక ఫ్రూట్ మండి వ్యాపారి ఆరోపించారు. ఈ సంక్షోభాన్ని సీఎం ఒమర్ అబ్ధుల్లా పరిష్కరించలేకపోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. సమస్యను పరిష్కరించలేకపోతే సీఎం రాజీనామా చేయాలని ఆయన అన్నారు.