హైదరాబాద్: హిందూ దేవాలయాల నిర్వహణ బాధ్యతలను హిందూ ఆధ్యాత్మిక గురువులు, భక్తులకు అప్పగించాలని ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు. టీటీడీ లడ్డూ మహా ప్రసాదంలో కల్తీ జరిగినట్లు వార్తలు రావడంతో ప్రపంచవ్యాప్తంగా హిందువులు గుండె పగిలి తల్లడిల్లుతున్నారని ఆయన అన్నారు. ఈ సంఘటన 1857నాటి సిపాయిల తిరుగుబాటు జ్ఞాపకాలను తిరగదోడిందన్నారు. ప్రసాదం కల్తీకి బాధ్యులైనవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే, దేవాలయాల నిర్వహణ బాధ్యతలను హిందూ సాధువులు, ఆధ్యాత్మిక గురువులు, భక్తులకు అప్పగించాలని కోరారు. హిందూ దేవాలయాల నిర్వహణను పర్యవేక్షించడానికి, వాటి పవిత్రతను కాపాడటానికి ఉత్తర, దక్షిణ భారతావనికి చెందిన ఆధ్యాత్మిక వేత్తలు, గురువులతో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని, వివాదాలు తలెత్తినపుడు జోక్యం చేసుకునేందుకు ప్రభుత్వ ప్రతినిధి ఒకరు ఈ కమిటీలో ఉండవచ్చునని చెప్పారు. అయితే ప్రధాన నిర్ణయాలన్నింటినీ మతపరమైన బోర్డులు మాత్రమే తీసుకోవాలని తెలిపారు.