AIADMK : తమిళనాడులో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. విజయ్ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ ఏర్పాటు తర్వాత సమీకరణాలు మారుతున్నాయి. ఏఐఏడీఎంకే పార్టీలో చీలిక వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం విజయ్ జోసెఫ్.. ఆ పార్టీ సీనియర్ రెబల్ నేతలను కలవడమే ఇందుకు కారణం. ఇప్పటికే కొందరు ఏఐఏడీఎంకే నేతలు విజయ్‌కు మద్దతు తెలుపుతున్నారు.
ఏఐఏడీఎంకే సీనియర్ నేతలైన షణ్ముగమ్, ఎస్పీ వేలుమణిలను విజయ్ కలిశారు. పార్టీలోని చాలామంది ఎమ్మెల్యేలు విజయ్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరికొందరు నేతలు మాత్రం విజయ్ను వ్యతిరేకిస్తున్నారు. ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు దాదాపు 30 మంది విజయ్ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. టీవీకే ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వాన్ని విజయ్ ఏర్పాటు చేసినప్పటికీ.. బుధవారం అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాల్సి ఉంది. విజయ్ విశ్వాస పరీక్ష నెగ్గితేనే అధికారంలో ఉంటారు. ఈ నేపథ్యంలోనే విజయ్‌కు మద్దతు ఇచ్చేందుకు ఏఐఏడీఎంకేలోని ఒక వర్గం సిద్ధంగా ఉంది. షణ్ముగమ్, ఎస్పీ వేలుమణి అందుకే విజయ్ను కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే ఆ పార్టీ రెండుగా విడిపోవడం ఖాయం.
రెబల్ ఎమ్మెల్యేలు ఇప్పటికే ప్రోటెం స్పీకర్‌కు తమ పార్టీ తరఫును లెజిస్లేటివ్ పార్టీ లీడర్‌గా వేలుమణిని గుర్తించాలని లేఖ రాసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో ఈ నిర్ణయాన్ని ఎడప్పాడి పళనిస్వామి వ్యతిరేకిస్తున్నారు. తానే ఏఐఏడీఎంకే పార్టీ లెజిస్లేటివ్ లీడర్ అని గుర్తు చేస్తూ పళనిస్వామి అసెంబ్లీ సెక్రెటరీకి లేఖ రాశారు. దీంతో అటు వేలుమణి, ఇటు పళనిస్వామి.. ఇద్దరిలో ఎవరిని ఏఐఏడీఎంకే పార్టీ లెజిస్లేటివ్ లీడర్‌గా స్పీకర్ గుర్తిస్తారో చూడాలి. స్పీకర్ నిర్ణయాన్ని బట్టి కూడా పార్టీలో చీలిక వచ్చే అవకాశం ఉంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సరైన సీట్లు సాధించని కారణంగా.. ఇప్పటికే పార్టీలో నేతల మధ్య విబేధాలు తలెత్తాయి. తాజా ఎన్నికల్లో ఏఐఏడీఎంకే 47 సీట్లు మాత్రమే సాధించింది.