న్యూఢిల్లీ: పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ భారత్‌లో చేస్తున్న గూఢచర్యం (ISI Spy) తవ్వేకొద్దీ బయటకొస్తోంది. దేశంలో విధ్వంసం సృష్టించడమే లక్ష్యంగా భారత పౌరులనే టార్గెట్ చేసుకుని నెట్వర్క్ నడుపుతున్నది. వివిధ ప్రలోభాలకు గురిచేసి తన దారిలోకి తెచ్చుకుని ఇండియన్ ఆర్మీ, సైనిక స్థావరాల రహస్యాలను చేజిక్కించుకుంటున్నది. ‘పహల్గామ్’ ఉగ్రదాడి తర్వాత భారత్‌లో ఉంటూ పాక్‌కు సహకరిస్తున్నవారిపై ప్రభుత్వం నిఘా సారించింది. ఇలా దాయాది వలలో చిక్కుకున్న వాళ్లు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. తాజాగా పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్(PIO)కు అక్రమంగా భారత సంస్థలకు మొబైల్ సిమ్ కార్డులను సరఫరా చేస్తున్న రాజస్థాన్‌కు చెందిన కాసిమ్ అనే వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.
డీగ్ జిల్లాలోని గంగోరా గ్రామానికి చెందిన కాసిమ్ (34) రెండుసార్లు పాకిస్తాన్‌కు వెళ్లాడని దాదాపు 90 రోజులపాటు అక్కడే ఉన్నాడని అధికారులు తెలిపారు. మొదట 2024 ఆగస్టులో, అనంతరం 2025 మార్చిలో పాక్‌కు వెళ్లాడని చెప్పారు. ఈ సందర్భంగా పాక్ గూఢచారి సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ISI) అధికారులను కలిసినట్లు అనుమాలున్నాయని ఒక సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. భారత సైన్యంతోపాటు ప్రభుత్వ సంస్థలకు చెందిన కీలక సమాచారాన్ని సేకరించడానికి భారత మొబైల్ నంబర్లను దుర్వినియోగం చేస్తున్నాడని స్పెషల్ సెల్‌కు నిఘా సమాచారం అందింది. ఆయన మొబైల్ సిమ్ కార్డులను భారత్‌లో కొనుగోలు చేసి, ఇక్కడి పౌరుల సహాయంతో సరిహద్దు మీదుగా పాక్‌కు పంపాడనే ఆరోపణలున్నాయని తెలిపారు. తమకు అందిన ఇన్పుట్ మేరకు చట్టప్రకారం కాసిమ్పై కేసు నమోదుచేసి, దర్యాప్తుచేస్తున్నామన్నారు.