న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణకు సంబంధించి మళ్లీ ఊహాగానాలు జోరందుకున్నాయి. త్వరలోనే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ ఖాయమన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల నిరసనలు మోదీ-షా వర్గం ప్రతిష్టకు కొంత మేర భంగం కలిగించిన నేపథ్యంలో తమ పట్టును తిరిగి నిలుపుకోవడానికి మోదీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ఒక అవకాశంగా భావిస్తున్నది.
ఒక మరాఠీ వార్తా కథనం ప్రకారం చాలా కాలం తర్వాత బీజేపీ నాయకత్వం బలహీనంగా, అస్థిరంగా కనిపిస్తుండటంతో సంఘ్ ఒక అడుగు ముందుకు వేయాలని భావిస్తున్నది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మోదీ మంత్రివర్గంలో చేరనున్నారని వార్తలు ఈ పరిణామాల్లో భాగమే. ఎందుకంటే ఢిల్లీ సంఘ్ ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించడానికి నాగ్‌పూర్‌లో జన్మించిన ఈ నాయకుడే అత్యంత ఉత్తమమైన ఎంపికగా సంఘ్ యోచిస్తున్నది. ఫడ్నవీస్ కూడా ఢిల్లీకి మకాం మార్చడానికి సానుకూలంగా ఉన్నట్టు ఆ వార్తలను బట్టి తెలుస్తున్నది.

కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగినపుడు ఫడ్నవీస్‌కు పదోన్నతి లభిస్తుందని శివసేన(యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ పేర్కొన్నారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండేతోపాటు ఫడ్నవీస్‌కు కూడా మోదీ మంత్రివర్గంలో చోటు దక్కుతుందని వార్తలు వస్తున్నాయి. ఆర్ఎస్ఎస్, బీజేపీ మధ్య అధికార పోరు జరుగుతున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో రౌత్ వ్యాఖ్యలను పూర్తిగా నిరాధారమైనవని కొట్టివేయడానికి వీల్లేదు.
రాజ్‌నాథ్ సింగ్, జువాల్ ఓరమ్, శివరాజ్ సింగ్ చౌహాన్, నితిన్ గడ్కరీ వంటి సీనియర్ నాయకులను తమ బాధ్యతల నుంచి తప్పుకోవాలని కోరారని మరాఠీ వార్తలు పేర్కొన్నాయి. అయితే వారందరూ అందుకు నిరాకరించారని కూడా పేర్కొన్నాయి. పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీని మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశం ఉందని గతంలో వార్తలు వచ్చాయి. ఆయన రాజ్యసభ పదవీకాలం నవంబర్‌లో ముగియనున్నది. అయితే ఆయనకు మరోసారి అవకాశం కల్పించాలా, వద్దా అనే విషయంలో బీజేపీ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. అయితే ఈ మార్పు చేర్పుల్లో భాగంగా గడ్కరీ, రాజ్‌నాథ్ సింగ్ వంటి ప్రభావవంతమైన సీనియర్ నాయకులను తొలగిస్తారా లేక వారికి వేరే బాధ్యతలు అప్పగిస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది.