న్యూఢిల్లీ, ఆగస్టు 16 : దేశ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి గాంచిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లలో నిపుణులైన డాక్టర్లు పెద్దయెత్తున వలస పోతున్నారు. వీరంతా ప్రైవేట్, కార్పొరేట్ దవాఖానలకు క్యూ కడుతున్నట్టు తెలిసింది. కాగా, ఎయిమ్స్‌లో కన్నా ప్రైవేట్ హాస్పిటల్స్‌లో నాలుగు నుంచి 10 రెట్ల వేతనం అధికంగా ఆఫర్ చేస్తున్నారని, ఇటీవలే ఢిల్లీ ఎయిమ్స్ నుంచి రాజీనామా చేసిన ఒక సీనియర్ డాక్టర్ తెలిపారు. 2022-2024 మధ్య దేశవ్యాప్తంగా 20 సంస్థలలో 429 మంది డాక్టర్లు తమ పదవులకు రాజీనామా చేశారని ఇటీవల పార్లమెంట్లో ప్రభుత్వం వెల్లడించింది.
ప్రైవేట్ ఉద్యోగాల కోసం ఎయిమ్స్ నుంచి డాక్టర్లు రాజీనామా చేస్తున్నారా? అన్న ప్రశ్నకు.. అత్యధికంగా ప్రధాన కేంద్రమైన ఢిల్లీ ఎయిమ్స్‌లో 52 మంది డాక్టర్లు రాజీనామా చేసినట్టు తెలిపింది. అలాగే రిషికేశ్ ఎయిమ్స్‌లో 38 మంది, రాయ్‌పూర్ ఎయిమ్స్‌లో 35 మంది, బిలాస్పూర్ ఎయిమ్స్‌లో 32 మంది, ఏపీలోని మంగళగిరి ఎయిమ్స్‌లో 30 మంది డాక్టర్లు రాజీనామా చేశారు. ఇక బోధనేతర రంగంలో 20 ఎయిమ్స్‌ల్లో ప్రతి ముగ్గురు ఫ్యాకల్టీలకు ఒక పోస్ట్ ఖాళీగా ఉంది.