Special trains : దేశవ్యాప్తంగా హోలీ పండుగ (Holi festival) ను ఘనంగా జరుపుకుంటారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ ఎంతో సంతోషంగా ఈ పండుగ చేసుకుంటారు. ఈ పండుగ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) శాఖ అధికారులు ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పారు. పండుగకు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే ఏయే రూట్లలో ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి కాజీపేట మీదుగా ఢిల్లీ హజరత్ నిజాముద్దీన్‌కు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నారు. ఈ నెల 6 నుంచి 18 వరకు ఈ స్పెషల్ ట్రైన్స్ నడవనున్నాయి. 07707 నెంబర్ రైలు ఈ నెల 6, 12, 16 తేదీల్లో చర్లపల్లిలో రాత్రి 8.45 గంటలకు బయలుదేరి నిజాముద్దీన్‌కు 8, 14, 18 తేదీల్లో తెల్లవారుజామున 1.30 గంటలకు చేరుకుంటుంది. ఈ నెల 8, 14, 18 తేదీల్లో 07708 నెంబర్ రైలు హజరత్ నిజాముద్దీన్‌లో తెల్లవారుజామున 3.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.
కాజీపేట, రామగుండం, మంచిర్యాల జిల్లా, సిర్పూర్ కాగజ్ నగర్, బల్లార్షా, చంద్రపూర్, నాగపూర్, రాణి కమలపాటి, బీనా, ఝాన్సీ, అగ్రకాంట్, పాల్వాల్ రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. ఈ ట్రైన్లలో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ స్లీపర్ బోగీలు ఉంటాయి. ప్రయాణికులు www.irctc.co.in వెబ్‌సైట్‌కు వెళ్లి టికెట్ బుక్ చేసుకోవచ్చు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.