ప్రస్తుతం భారతదేశంలో ఉన్న వాహనాల్లో అధికశాతం పెట్రోలు, డీజిల్‌తో నడిచేవే. వీటిలో ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్(ఐసీఈ)లు ఉంటాయి. అయితే ఇకపై ఇలాంటి వాహనాల వినియోగాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకునేలా ఉంది. ఈ ఐసీఈ ఇంజిన్లు ఉన్న వాహనాలకు అనుమతులు లేని ప్రత్యేక మొబిలిటీ జోన్లు (స్పెషల్ మొబిలిటీ జోన్లు) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది.
దీని గురించి గ్లాస్గో సదస్సులో కూడా భారత ప్రభుత్వం ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తాజాగా బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. ‘అర్బన్ ఏరియాల్లో ప్రజా రవాణా వ్యవస్థ వినియోగంలో మార్పులు తెచ్చేందుకు.. జీరో ఫాసిల్ ఇంధంనం విధానాన్ని తీసుకొస్తాం’ అని నిర్మలా సీతారామన్ చెప్పారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు.
ఈ జోన్లలో అసలు పెట్రోలు, డీజిల్ వాహనాలను అనుమతించరా? లేక యూరోపియన్ దేశాల్లో ఉన్నట్లు ఈ జోన్లలోకి సాధారణ వాహనాలు ప్రవేశించాలంటే ప్రత్యేక చార్జీలు వసూలు చేస్తారా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది. కాలుష్యాన్ని తగ్గించడానికి ఇప్పటికే చాలా చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
వీటిలో భాగంగానే కాలుష్య నిబంధనలు అనుసరించే ఇంజిన్ల వాడకం, ఒక వయసు దాటిన వాహనాలపై నిషేధం విధించడం తదితర చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ సరికొత్త నిషేధిత జోన్టను ముందుగా కీలకమైన జీవవైవిధ్య ప్రాంతాల్లో అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైల్డ్‌లైఫ్ శాంక్చువరీలు, జాతీయ పార్కుల సమీపంలో వీటిని తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎయిర్ క్వాలిటీ తక్కువగా ఉన్న నగరాల్లో వీటిని తీసుకొస్తారని సమాచారం.