e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 9, 2021
Home జాతీయం బెంగాల్‌ దంగల్‌

బెంగాల్‌ దంగల్‌

  • దేశ రాజకీయాలపై ప్రభావం చూపనున్న ఎన్నికలు 
  • మోదీకి కొరకరాని కొయ్యగా మారిన మమత 
  • ఆమెను ఓడించి తీరాలని బీజేపీ పంతం 
  • దీదీ గెలిస్తే దేశంలో విపక్ష కూటమికి మరింత దన్ను 
  • కమలం వికసిస్తే మరింత పెరుగనున్న మోదీ ఇమేజ్‌ 

నాలుగు రాష్ర్టాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి మరో ఇరవై రోజుల్లో ఎన్నికలు జరుగబోతున్నాయి. వీటన్నింటిలో పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలపై అటు రాజకీయ విశ్లేషకుల నుంచి ఇటు సాధారణ ప్రజల వరకూ ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. కారణం.. బెంగాల్‌ ఫలితం దేశ రాజకీయాలపై గణనీయమైన ప్రభావమే చూపించే అవకాశం ఉంది. ప్రధాని మోదీ విమర్శకుల్లో ముందు వరుసలో ఉన్న మమత మళ్లీ గెలిస్తే.. దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పార్టీలకు అదనపు బలం చేకూరుతుంది. అలాగాకుండా, మమతను ఓడించి బీజేపీ అధికారం సాధిస్తే.. అది పెను సంచలనమే అవుతుంది. ఒకప్పుడు భారతదేశానికి మార్గదర్శనం చేసిన బెంగాల్‌ను కైవసం చేసుకుంటే.. దేశ రాజకీయాల్లో సమీప భవిష్యత్తులో ఇక తమకు తిరుగు ఉండబోదని కమలనాథులు భావిస్తున్నారు. ఈ విధంగా బెంగాల్‌ దంగల్‌ అనేది ఆ రాష్ర్టానికే పరిమితం కాలేదు. 

హ్యాట్రిక్‌ దక్కేనా? 

వామపక్షాల మూడు దశాబ్దాల పాలనకు చరమగీతం పాడుతూ 2011లో బెంగాల్‌లో అధికార పగ్గాలు చేపట్టిన తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ 2016లోనూ విజయం సాధించారు. ఈసారి కూడా ఎన్నికల్లో గెలుపును కైవసం చేసుకొని హ్యాట్రిక్‌ కొట్టాలని భావిస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో అధికార బీజేపీపై సునిశిత విమర్శలు చేసే వారిలో మమత అగ్రభాగాన ఉంటున్నారు. కేంద్రప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ, సీఏఏ, ఎన్నార్సీ, ప్రైవేటీకరణ నిర్ణయాలను ఆమె తప్పుబట్టారు. పార్లమెంటులో తృణమూల్‌ సభ్యుల సంఖ్య 22. అయినప్పటికీ, 51 సభ్యులున్న ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ కంటే తృణమూల్‌ పార్టీనే చురుగ్గా ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్నదన్న పేరుంది. అందుకే ఈ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఓడిపోతే జాతీయ స్థాయిలో విపక్ష కూటమి గళమే చిన్నబోతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిణామాలను గమనించిన విపక్ష పార్టీలైన ఎస్పీ, ఆర్జేడీ, జేఎంఎం, ఎన్సీపీ, శివసేన ఈ ఎన్నికల్లో మమతకు మద్దతుగా నిలిచాయి. ఈ ఎన్నికల్లో తృణమూల్‌ విజయం సాధిస్తే.. వచ్చే ఏడాది  ఎన్నికలు జరుగనున్న యూపీ, పంజాబ్‌, గోవా, ఉత్తరాఖండ్‌, మణిపూర్‌, హిమాచల్‌ప్రదేశ్‌, గుజరాత్‌ తదితర రాష్ర్టాల్లోని స్థానిక పార్టీల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంచే అవకాశం ఉంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి విపక్షాలు ఒక కూటమిగా ముందుకొచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి.

బీజేపీ వచ్చేనా?

బెంగాల్‌ ఎన్నికలను బీజేపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నది. దీనికి ప్రధాన కారణం మోదీ సర్కార్‌ తీసుకునే వివాదాస్పద నిర్ణయాలను మమత గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ఎన్నికల్లో తృణమూల్‌ను ఓడించి బీజేపీ వ్యతిరేక విపక్షాల్లో కీలకంగా ఉన్న ఆ పార్టీ ప్రభావాన్ని గణనీయంగా తగ్గించాలని బీజేపీ భావిస్తున్నది. ఇందులో భాగంగానే ఎన్నికలకు ముందే తృణమూల్‌లో బలమైన నేతగా ఉన్న సువేందు అధికారితో పాటు 18 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీని తమ పార్టీలో చేర్చుకుంది. ఎన్నికల సమయంలో మమత మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ కుటుంబంపై సీబీఐతో సోదాలు జరిపించింది. ఎన్నికల్లో ఓటింగ్‌ సరళిని విశ్లేషించుకొని కొత్త వ్యూహాల్ని అమలు చేయడం కోసమే బెంగాల్‌లో సుదీర్ఘంగా ఎనిమిది విడుతల్లో ఎన్నికలను జరిపేలా కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేసిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే.. ప్రతిపక్ష పార్టీల ఆత్మవిశ్వాసం మరింత బలహీనపడవచ్చు. 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల నాటికి మరోసారి అజేయశక్తిగా నిలువాలని బీజేపీ భావిస్తున్నది. పశ్చిమ బెంగాల్‌లో లభించే విజయం ఆ పార్టీ ఇమేజ్‌ను మరింత పెంచుతుంది.

సంగ్రామానికి సిద్ధమైన నందిగ్రామ్‌! 

మమతపై సువేందు అధికారి పోటీ 

బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల 

న్యూఢిల్లీ, మార్చి 6: మమతా బెనర్జీకి ఒకప్పుడు కుడిభుజంగా వ్యవహరించిన నాయకుడు సువేందు అధికారి.. ఇప్పుడు అదే మమతా దీదీపై అసెంబ్లీ ఎన్నికల బరిలో పోటీ పడనున్నారు. బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలకు 57 మంది అభ్యర్థులతో తొలి జాబితాను బీజేపీ శనివారం ప్రకటించింది. నందిగ్రామ్‌ స్థానం నుంచి పోటీకి సువేందును ఎంపిక చేసింది. ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కోల్‌కతాలోని భవానీపూర్‌ నియోజకవర్గాన్ని వదిలి, సువేందు సొంత నియోజకవర్గం నందిగ్రామ్‌ నుంచి పోటీ చేస్తానని మమతా బెనర్జీ శుక్రవారం ప్రకటించడం తెలిసిందే. మరుసటి రోజే సువేందు అభ్యర్థిత్వాన్ని బీజేపీ ఖరారు చేసింది. నందిగ్రామ్‌పై సువేందుకు గట్టి పట్టున్నది. తృణమూల్‌ను వదిలి బీజేపీలో చేరిన సమయంలో.. నందిగ్రామ్‌లో తనపై పోటీ చేయాలంటూ మమతకు ఆయన సవాల్‌ విసిరారు. మమతపై కనీసం 50 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తానని చెప్పుకొచ్చారు. ఈ సవాల్‌ను మమత స్వీకరించి.. నందిగ్రామ్‌ నుంచి పోటీకి దిగుతున్నట్లు శుక్రవారం ప్రకటించారు. బెంగాల్‌లో మమతా బెనర్జీ అధికారంలోకి రావడానికి 2007 నాటి నందిగ్రామ్‌ ఉద్యమం ముఖ్య కారణంగా నిలిచింది. నాడు తృణమూల్‌లో ఉన్న సువేందు ఆ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో హోరాహోరీ పోరుకు నందిగ్రామ్‌ వేదికైంది.

బీజేపీలోకి తృణమూల్‌ మాజీ ఎంపీ

న్యూఢిల్లీ/కోల్‌కతా, మార్చి 6: పశ్చిమ బెంగాల్‌లో తొలి విడత ఎన్నికలకు మూడు వారాల్లోపే గడువు ఉందనగా  తృణమూల్‌ కాంగ్రెస్‌ మాజీ ఎంపీ దినేశ్‌ త్రివేది శనివారం బీజేపీలో చేరారు. గత నెలలోనే ఆయన రాజ్యసభ సభ్యతాన్వికి రాజీనామా చేశారు. రాష్ట్రంలో హింసాత్మక ఘటనలను ఖండిస్తూ రాజ్యసభలోనే తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. తృణమూల్‌లో కొనసాగడం ఇబ్బందికరంగా ఉందన్నారు. ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయల్‌, ధర్మేంద్ర ప్రధాన్‌ సమక్షంలో త్రివేది ఆ పార్టీలో చేరారు. త్రివేది కృతజ్ఞత లేని నాయకుడని, ఎన్నికల ముందు తమ పార్టీని వెన్నుపోటు పొడిచారని తృణమూల్‌ విమర్శించింది.

Advertisement
బెంగాల్‌ దంగల్‌
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement