రాంచీ, ఫిబ్రవరి 1: జార్ఖండ్‌లో రాజకీయ హైడ్రామాకు తెరపడింది. అధికార జేఎంఎం కూటమి శాసనసభాపక్ష నేత చంపై సొరేన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఎట్టకేలకు ఆహ్వానించారు. దీంతో రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా చంపై శుక్రవారం ప్రమాణం చేయనున్నారు.
10 రోజుల్లో ప్రభుత్వం మెజార్టీ నిరూపించుకోవాలని గవర్నర్ స్పష్టంచేశారు. అంతకుముందు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంలో గవర్నర్ తీవ్ర జాప్యం చేయడం, బీజేపీ ప్రలోభాల భయం నేపథ్యంలో అధికార పక్షంలో ఆందోళన నెలకొన్నది. ఈ క్రమంలో ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలించేందుకు కూడా అధికార కూటమి సిద్ధమైంది. అయితే వాతావరణం అనూకూలించకపోవడంతో విరమించుకున్నది.
రోజంతా హైడ్రామా..
ఈడీ అరెస్టు నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి జేఎంఎం నేత హేమంత్ సోరేన్ రాజీనామా తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అధికార సంకీర్ణ శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన చంపై సొరేన్ సంసిద్ధత వ్యక్తం చేసినప్పటికీ, గవర్నర్ నిర్ణయం తీసుకోకపోవడంతో గందరగోళం నెలకొన్నది. చంపై సొరేన్ బుధవారం సాయంత్రంతో పాటు గురువారం పలువురు ఇతర మిత్ర పక్ష నేతలతో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను రెండోసారి కలిశారు.
అసెంబ్లీలో మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు తమకు ఉన్నదని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఆయన కోరారు. సీఎంగా హేమంత్ సొరేన్ రాజీనామా చేసిన తర్వాత రాష్ట్రంలో ‘గందరగోళం’ నెలకొన్నదని, రాష్ర్టానికి సీఎం లేకపోవడం రాజకీయ సంక్షోభాన్ని తీవ్రం చేస్తున్నదని పేర్కొంటూ చంపై గవర్నర్‌కు అంతకుముందు లేఖ రాశారు. రాజ్యాంగ అధిపతిగా కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తారని ఆశిస్తున్నామని అన్నారు. కాగా, చంపై సొరేన్ గవర్నర్‌ను కలిసేందుకు వెళ్లే ముందు అధికార జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి 43 మంది ఎమ్మెల్యేలతో కూడిన ఒక వీడియోను విడుదల చేసింది.
టేకాఫ్ కాకపోవడంతో రాంచీలోనే..
తగిన మెజార్టీ ఉన్నప్పటికీ, గవర్నర్ చంపై సొరేన్తో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించడంలో ఆలస్యం జరుగుతున్న క్రమంలో జేఎంఎం, ఇతర సంకీర్ణ పక్షాలు ఆందోళన చెందాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష బీజేపీ తమ శాసనసభ్యులను ప్రలోభపెట్టకుండా వారిని హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. రాంచీలోని సర్క్యూట్ హౌస్ నుంచి బస్సు, కార్ల కాన్వాయ్‌తో గురువారం రాత్రి ఎయిర్‌పోర్టు చేరుకొన్నారు. ప్రత్యేక విమానం ఎక్కినప్పటికీ, వాతావరణం అనుకూలించకపోవడంతో విమానం టేకాఫ్ కాలేదు. ప్లాన్‌లో భాగంగా ఎమ్మెల్యేల తరలింపు తర్వాత హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ, ఇతర హోటళ్లలో రూమ్‌లు కూడా బుక్ చేసినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
రిమాండ్ అభ్యర్థనపై నేడు తీర్పు
హేమంత్ సొరేన్‌ను స్థానిక పీఎంఎల్ఏ కోర్టు ఒకరోజు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. సొరేన్‌ను 10 రోజుల రిమాండ్‌కు అప్పగించాలన్న ఈడీ అభ్యర్థనపై తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది. మరోవైపు తన అరెస్టును సవాల్ చేస్తూ హేమంత్ సొరేన్ గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన అరెస్టు అక్రమమని, లోక్‌సభ ఎన్నికల వేళ కేంద్రంలోని బీజేపీ పన్నిన కుట్రలో భాగంగా ఈడీ తనను అరెస్టు చేసిందని ఆరోపించారు. ఆయన పిటిషన్‌పై న్యాయస్థానం శుక్రవారం విచారణ చేపట్టే అవకాశం ఉన్నది.