Sparrow | తిరువనంతపురం : పక్షులు, మూగజీవాలు కళ్ల ముందే చనిపోతున్నా.. ఎవరూ పట్టించుకోరు. కానీ ఓ పక్షిని ప్రాణాలతో కాపాడేందుకు స్వయంగా జడ్జి, కలెక్టర్ రంగంలోకి దిగారు. మూడు రోజుల పాటు తీవ్రంగా శ్రమించి.. ఆ పక్షిని ప్రాణాలతో కాపాడారు. ఈ పక్షి కథ తెలుసుకోవాలంటే కేరళలోని కన్నూరు జిల్లాకు వెళ్లాల్సిందే.
కన్నూరు జిల్లాలోని ఉల్లిక్కల్ పంచాయతీ పరిధిలోని మూసేసిన ఓ టెక్స్ టైల్ షాపు గ్లాస్ ప్యానెల్లో ఓ పక్షి చిక్కుకుంది. పక్షి ఆ గ్లాస్ ప్యానెల్లో చిక్కుకుని విలవిలలాడుతున్న దృశ్యాన్ని స్థానికులు గమనించారు. ఆ ప్యానెల్లో నుంచి బయట పడేందుకు పక్షి శతవిధాలా ప్రయత్నిస్తుంది. కానీ సాధ్యం కావట్లేదు. మిగతా దుకాణదారులు, స్థానికులు కూడా పక్షిని కాపాడలేని పరిస్థితి ఉంది.
ఎందుకంటే బిజినెస్ పార్ట్నర్స్ మధ్య ఉన్న వివాదం కారణంగా కోర్టు ఉత్తర్వులకు లోబడి ఆ షాపును కొన్ని నెలల క్రితం సీజ్ చేశారు. దీంతో షాపును తెరిచేందుకు కోర్టుకు వెళ్లి అనుమతి తీసుకోవాలి. ఇందుకోసం జిల్లా కలెక్టర్, ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా రంగంలోకి దిగారు. స్థానికుల సహాయంలో ఒక చిన్న పైపు ద్వారా ఆ పక్షికి ఆహారం, నీరు అందించారు.
చివరకు కోర్టు జడ్జి కూడా స్పందించి.. నేరుగా ఘటనాస్థలానికి చేరుకున్నారు. మూడు రోజుల తర్వాత జడ్జి, కలెక్టర్ సమక్షంలో ఆ షాపును తెరిచి.. గ్లాస్ ప్యానెల్లో చిక్కుకున్న పక్షిని ప్రాణాలతో కాపాడారు. ఏప్రిల్ 8న పక్షి చిక్కుకోగా, ఏప్రిల్ 10న గాల్లోకి ఎగిరిపోయింది.