Akhilesh Yadav : యూపీలోని కాన్పూర్‌లో వ్యాపారి ఇంట్లో రూ 200 కోట్ల నగదు పట్టుబడటంతో అరెస్టయిన బిజినెస్మెన్ పీయూష్ జైన్‌తో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తోసిపుచ్చారు. నోట్ల రద్దు విఫలమైందనేందుకు ఈ ఘటన విస్పష్ట ఉదాహరణని ఆయన పేర్కొన్నారు.
కొత్తగా ముద్రించిన రూ 2000 నోట్లను స్వాధీనం చేసుకున్న సోదాలు జరిపిన అధికారులే వీటి మూలాలను వెల్లడిస్తారని అఖిలేష్ అన్నారు. మరోవైపు జైన్ సమాజ్‌వాదీ పార్టీకి చెందిన పెర్ఫ్యూం వ్యాపారి అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సుల్తాన్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ పేర్కొన్నారు.
పీయూష్ జైన్ ఇంట్లో అధికారుల దాడుల్లో రూ 250 కోట్ల లెక్కతేలని నగదు పట్టుబడిందని చెబుతూ అఖిలేష్ జీ..ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని షా ప్రశ్నించారు. ఇక కాన్పూర్ ర్యాలీలో ప్రధాని మోదీ సైతం ఎస్పీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. యూపీలో ఇటీవల పట్టుబడిన నగదు విపక్షాల నిర్వాకాన్ని తేటతెల్లం చేసిందని అన్నారు.