న్యూఢిల్లీ/ హైదరాబాద్, మే 15(నమస్తే తెలంగాణ): నైరుతు రుతుపవనాలు ఈ ఏడాది మే 26న కేరళలో ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1 నాటికి కేరళను తాకి, అక్కడి నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు ఉత్తర దిశగా విస్తరిస్తాయి. గత ఏడాది రుతుపవనాలు మే 24న కేరళను తాకాయి. ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాలు మే 26కు 4 రోజులు అటు ఇటుగా కేరళలో ప్రవేశించే అవకాశం ఉన్నట్టు ఐఎండీ తెలిపింది. అలాగే వచ్చే 24 గంటల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాల మీదుగా రుతుపవనాలు ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నది. దేశంలో ఏడాదిలో కురిసే మొత్తం వర్షపాతంలో దాదాపు 70% ఈ 4 నెలల రుతుపవనాల కాలం(జూన్ నుంచి సెప్టెంబర్)లోనే కురుస్తుంది. వ్యవసాయం, దేశ ఆర్థికవ్యవస్థ, రిజర్వాయర్లు, భూగర్భ జలాల పెంపునకు ఈ వర్షాలు కీలకం. అయితే ఈ ఏడాది దేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ ఇప్పటికే తెలిపింది.
2026 వానకాలం సవాలుతో కూడుకుని ఉండొచ్చని ఐఎండీ హెచ్చరించింది. మధ్య, తూర్పు పసిఫిక్ మహాసముద్ర ఉపరితల జలాలు వేడెక్కే వాతావరణ పరిస్థితినే ఎల్నినో అంటారు. ఇది సాధారణంగా రుతుపవనాల గాలులను బలహీనపరుస్తుంది. దీనివల్ల దేశంలో నైరుతి రుతుపవనాల కాలంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుంది. దీంతో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. నీటి కొరతతో కరువు పరిస్థితులు ఏర్పడతాయి. పంటల ఉత్పత్తి తగ్గుతుంది. అయితే, కొన్ని దక్షిణ తీర ప్రాంతాల్లో ఎల్నినో వల్ల అధిక వర్షాలు, వరదలు సంభవించే అవకాశం ఉంది.
రాష్ట్రంలో రానున్న నాలుగు రోజులలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమేపీ రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉన్నదని వెల్లడించారు. శనివారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది.