Monsoon | నైరుతి రుతుపవనాలు చురుగ్గా ముందుకు కదులుతున్నాయని.. కేరళలలో రుతుపవనాల ప్రవేశానికి అనుకూల వాతావరణం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. జూన్ ఒకటి నాటికి నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని పేర్కొంది. మరో ఐదురోజుల్లో కేరళలో ప్రవేశించి.. పుదుచ్చేరి, తమిళనాడులోని పలు ప్రాంతాల్లోకి ప్రవేశిస్తాయని చెప్పింది. అయితే, గతంలో మే 31నే కేరళను చేరుతాయని అంచనా వేసిన విషయం తెలిసిందే. కేరళలో రుతుపవనాలకు ముందే భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలు ఉత్తరం వైపు కదులుతూ.. సాధారణంగా వేసవి ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కలిగిస్తుందని పేర్కొంది.
ఐఎండీ చీఫ్ మృత్యుంజయ్ మొహపాత్ర మాట్లాడుతూ విలేకరులతో మాట్లాడుతూ.. ఢిల్లీ, దక్షిణ హర్యానా, నైరుతి యూపీ, పంజాబ్‌లో ఐదు నుంచి ఏడు రోజులు వేడి నమోదైందని.. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 44-48 డిగ్రీలుగా నమోదైనట్లు ఆయన తెలిపారు. అసోంలో మే 25-26 తేదీల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయన్నారు. వాయువ్య భారతదేశం అంతటా మే రెండవ భాగంలో, మధ్య ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలలో వర్షాలు లేకపోవడం, ఎక్కువ పొడి వాతావరణం, వేడిగాలులతో నైరుతి రాజస్థాన్, పొరుగున ఉన్న గుజరాత్లో తుఫాను వ్యతిరేక ప్రసరణ కారణంగా హీట్వేవ్స్కు కారణమన్నారు.
ఇదిలా ఉండగా.. జూన్‌లో వాయువ్య భారత దేశం, మధ్య ప్రాంతంలోని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో హీట్‌వేవ్స్ కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇక రుతుపవనాల సీజన్లో ఈ ఏడాది దేశంలో సాధారణం వర్షాపాతం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని ఐఎండీ చీఫ్ మృత్యుంజయ్ మోహపాత్ర తెలిపారు. వ్యవసాయోత్పత్తుల కోసం వేసవి వర్షాలపై ఎక్కువగా ఆధారపడే దేశానికి సాధారణం కంటే ఎక్కువ వర్షాలు దోహదపడతాయని చెప్పింది.
వ్యవసాయం, ఆర్థిక వృద్ధికి ఊతమిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే కొద్ది రోజుల్లో కేరళలో వర్షపాతం కార్యకలాపాలు తీవ్రమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈశాన్య భారతదేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం, వాయువ్యంలో సాధారణం, మధ్య-దక్షిణ ద్వీపకల్ప ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాను రుతుపవనాల పురోగతికి దోహదపడిందని పేర్కొంది. రుతుపవనాలతో త్వరలోనే కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వివరించింది.