తిరువనంతపురం: మలయాళీ సినీ పరిశ్రమ మాలీవుడ్‌పై ప్రముఖ నటి రాధిక శరత్‌కుమార్ బాంబు పేల్చారు. ఓ మలయాళం సినిమా చిత్రీకరణ సమయంలో నటీమణుల కారవాన్‌లో రహస్య కెమెరాలను పెట్టారని, వాటి ద్వారా చిత్రీకరించిన అభ్యంతరకరమైన వీడియోలను నటులు తమ మొబైల్ ఫోన్లలో చూస్తుండటాన్ని తాను గమనించానని చెప్పారు.
ఈ సంఘటనతో తనకు చాలా కోపం వచ్చిందని, కారవాన్ ఇన్‌ఛార్జిని పిలిచి, మళ్లీ ఇలాంటి సంఘటన జరిగితే తీవ్రమైన చర్య తీసుకుంటానని హెచ్చరించానని చెప్పారు. ఓ మలయాళీ టీవీ చానల్‌తో మాట్లాడుతూ రాధిక చేసిన ఈ ఆరోపణలతో అందరూ ఉలిక్కిపడ్డారు. జస్టిస్ హేమ కమిటీ నివేదికపై సినీ పరిశ్రమల్లోని పురుష నటులు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆమె ప్రశ్నించారు. రాధిక ఆరోపణలపై ఆర్ఎంపీ నేత, ఎమ్మెల్యే కేకే రెమ స్పందిస్తూ సినీ పరిశ్రమ అతి పెద్ద అండర్ వరల్డ్‌గా మారుతోందన్నారు. రాధిక ఆరోపణలపై దర్యాప్తు జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
మలయాళం సినీ కళాకారుల సంఘం అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన నటుడు మోహన్‌లాల్ శనివారం మాట్లాడుతూ, అందరూ మొత్తం దృష్టిని తమ సంఘంపైనే పెట్టవద్దని కోరారు. దర్యాప్తు జరుగుతున్నదని, పరిశ్రమను నాశనం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ‘హేమ కమిటీ నివేదిక వివరాలివ్వండి’ మలయాళం సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల గురించి బయటపెట్టిన జస్టిస్ హేమ కమిటీ నివేదికను పూర్తిగా తమకు ఇవ్వాలని జాతీయ మహిళా కమిషన్ కేరళ ప్రభుత్వాన్ని కోరింది. ఈ నివేదికలోని కొన్ని వివరాలు మాత్రమే బహిరంగంగా అందుబాటులో ఉన్నాయని తెలిపింది.