న్యూఢిల్లీ, డిసెంబర్ 5: ‘లేదు.. ఆమె నన్ను ప్రధానిని చేయరు’.. సోనియాగాంధీని ఉద్దేశించి మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ చేసిన వ్యాఖ్యలివి. 2004లో ప్రధాని పదవి చేపట్టడంపై ఆయన కుమార్తె శర్మిష్ఠ అడిగిన ప్రశ్నకు ప్రణబ్ పై విధంగా సమాధానమిచ్చారు. ‘ఇన్ ప్రణబ్, మై ఫాదర్: ఎ డాటర్స్ రిమెంబర్స్’ పేరిట తాను రాసిన పుస్తకంలో శర్మిష్ఠ ఈ విషయాలను ప్రస్తావించారు. ఈ నెల 11న ఈ పుస్తకం విడుదల కానుంది. పుస్తకంలో తన తండ్రికి సంబంధించిన కీలక విషయాలను ఆమె వెల్లడించారు. ప్రధాని పదవికి తనను తిరస్కరించినా సోనియాగాంధీపై తన తండ్రికి ఎలాంటి ద్వేషభావం లేదని పేర్కొన్నారు. అలాగే ప్రధానిగా ఎంపికైన మన్మోహన్సింగ్పైనా ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు. తన తండ్రి డైరీ, తనతో స్వయంగా చెప్పిన పలు విషయాలు, తండ్రి స్నేహితులు, సన్నిహితులు, రాజకీయ మిత్రుల నుంచి సేకరించిన సమాచారం, తన పరిశోధనలు క్రోడీకరించి ఈ పుస్తకాన్ని రాసినట్టు ఆమె తెలిపారు.