న్యూఢిల్లీ : సీఏఏ, ఎన్ఆర్సీ నిరసనల సందర్భంగా విద్వేష ప్రసంగాలు చేశారంటూ తమపై దాఖలైన పిటిషన్లను కొట్టివేయాలని ఢిల్లీ హైకోర్టులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ అఫిడవిట్ దాఖలు చేశారు. సోనియా, రాహుల్ గాంధీ మత ఘర్షణలను ప్రేరేపించేలా ప్రసంగించడం 2020లో ఢిల్లీలో అల్లర్లకు దారితీసిందని ఈ పిటిషన్ ఆరోపించింది.
ఢిల్లీ అల్లర్ల వెనుక జరిగిన కుట్రను పక్కదారి పట్టిస్తూ ఈ పిటిషన్ను పధకం ప్రకారం ముందుకు తెచ్చారని సోనియా, రాహుల్ గాంధీలు అఫిడవిట్లో పేర్కొన్నారు. పాలక పక్ష సభ్యులు చేసిన వ్యాఖ్యలను విడిచి ప్రతివాదులపై చర్యలు తీసుకునేలా ప్రస్తుత పిటిషన్ను వారికి అనుకూలంగా రూపొందించారని అఫిడవిట్లో సోనియా, రాహుల్ ప్రస్తావించారు.
సీఏఏ పట్ల వ్యతిరేకత కనబరచడం హింసను ప్రేరేపించడం కాదని అఫిడవిట్ పేర్కొంది. పార్లమెంట్లో ఆమోదం పొందిన బిల్లు, లేదా చట్టంపై వ్యక్తులను అభిప్రాయ వ్యక్తీకరణకు నిరాకరించడం దానిపై చర్చకు నిరాకరించడం పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛను ఉల్లంఘించడమే అవుతుందని అఫిడవిట్ స్పష్టం చేసింది.