
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ( Sonia Gandhi ) కేంద్ర సర్కారుపై మండిపడ్డారు. ఇవాళ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన సోనియాగాంధీ.. వివాదాస్పద వ్యవసాయ చట్టాలను మోదీ ప్రభుత్వం అప్రజాస్వామి పద్ధతిలో రద్దు చేసిందని విమర్శించారు. బీజేపీ పాలకులు ఆ చట్టాలను చేసినప్పుడు అనుసరించిన పంథానే రద్దు చేయడానికి కూడా అనుసరించారని ఆరోపించారు.
కేంద్ర సర్కారు ఎట్టకేలకు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేసింది. అయితే అందుకోసం తనకు తెలిసిన అప్రజాస్వామిక పంథానే అనుసరించింది. వ్యవసాయ చట్టాలకు సంబంధించిన బిల్లులను ఎలాగైతే అప్రజాస్వామిక రీతిలో ఆమోదించుకున్నారో, అదేవిధంగా వాటిని రద్దు చేశారని ఫైరయ్యారు. దాదాపు 13 నెలలపాటు నిరంతరం పోరాటం చేసి అహంకారి అయిన ప్రభుత్వం మెడలు వంచిన రైతులకు సెల్యూట్ చేద్దామని తన పార్టీ ఎంపీలతో వ్యాఖ్యానించారు.