రాజ్యసభకు చెందిన 12 మంది ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేసిన విషయంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన నివాసంలో ప్రతిపక్షాలతో ఓ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీ రాహుల్, ఎన్సీపీ నుంచి శరద్ పవార్, శివసేన నుంచి రౌత్, డీఎంకే నుంచి టీఆర్ బాలు, సీపీఎం నుంచి సీతారాం ఏచూరీ, నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఫరూక్ అబ్దుల్లా హాజరయ్యారు. అయితే తృణమూల్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మాత్రం సోనియా గాంధీ షాక్ ఇచ్చారు. ఈ సమావేశానికి ఆమెను ఆహ్వానించలేదు. రాజ్యసభ సభ్యుల సస్పెషన్, పరిష్కార మార్గాల చుట్టూ ఈ సమావేశం సాగింది.
అయితే రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్ విషయంలో చైర్మన్ వెంకయ్యనాయుడు దగ్గరికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను పంపాలని, ఈ విషయంపై ఓ పరిష్కార మార్గం కనుగొనాలని సోనియా గాంధీ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడారు. ప్రతిపక్షాల ఐక్యతే తమకు ప్రధాన అజెండా అని, ఇలాంటి సమావేశాలు మున్ముందు మరిన్ని జరుగుతాయని ప్రకటించారు. ఈ సమావేశంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా పాల్గొన్నారని రౌత్ తెలిపారు.