న్యూఢిల్లీ: లద్దాఖ్ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ ఏర్పాటు చేసిన స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ ఆఫ్ లద్దాఖ్‌కు గతంలో జారీ చేసిన ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్‌ను కేంద్ర ప్రభుత్వం గురువారం రద్దు చేసింది. ప్రభుత్వేతర సంస్థలు విదేశీ నిధులను స్వీకరించేందుకు అవకాశం కల్పించే చట్టాన్ని ఈ సంస్థ పదేపదే ఉల్లంఘించినట్లు తెలిపింది.
వాంగ్చుక్పై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దర్యాప్తు ప్రారంభమైంది. ఆయన ఏర్పాటు చేసిన హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ లద్దాక్ (హెచ్ఐఏఎల్)కు వస్తున్న నిధులపై దర్యాప్తు రెండు నెలల క్రితం ప్రారంభమైందని సీబీఐ అధికారులు చెప్పారు. ఆయన ఈ ఏడాది ఫిబ్రవరి 6న పాకిస్థాన్‌లో పర్యటించడంపై కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా ఇవ్వాలని, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూలులో చేర్చాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. దీని కోసం ఆయన ఇటీవల నిరాహార దీక్ష చేశారు.