Sonam Wangchuk | జులై 20 వరకు తాను బతికే ఉంటానని ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ తెలిపారు. నీట్ (NEET) పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దాదాపు 20 రోజులకు పైగా సోనమ్ ఆమరణ నిరాహార దీక్ష చేన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజైన జులై 20న కాక్రోచ్ జనతా పార్టీ (CJP)నిర్వహించతలపెట్టిన ‘చలో సంసద్’ (Chalo Sansad) మార్చ్ విజయవంతం అయ్యే వరకు తాను ఏదేమైనా సరే ప్రాణాలతోనే ఉంటానని, ఒకవేళ మార్చ్ విఫలమైతే దెయ్యం రూపంలోనైనా తిరిగి వస్తానని ఆయన స్పష్టం చేశారు.
వాంగ్‌చుక్ నిరాహార దీక్ష నేపథ్యంలో ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలని ఢిల్లీ హైకోర్ట్ గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వైద్య నివేదిక ప్రకారం అవసరమైన జోక్యం చేసుకోవాలని కోరింది. ‘ప్రాణం విలువైంది’ అని వ్యాఖ్యానించిన కోర్ట్ వాంగ్‌చుక్ ఆరోగ్యాన్ని రక్షించేందుకు సాధ్యమైన ప్రతి వైద్య ప్రయత్నాన్ని చేయాలని చెప్పింది. అయితే నిరంతర ఆందోళనల నేపథ్యంలో ఆయన ఆరోగ్యం తీవ్రంగా క్షీణిస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు రాజకీయ నాయకులు, ప్రముఖులు, న్యాయ సంస్థలు సోనమ్‌ను నిరాహార దీక్ష విరమించాలని కోరారు. కానీ ఆయన తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. బరువు తగ్గిపోయినప్పటికి, తన దీక్షను విరమించే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు.