లేహ్, సెప్టెంబర్ 27: లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేసిన పర్యావరణ ఉద్యమకారుడు, సామాజికవేత్త సోనమ్ వాంగ్చుక్కు పాకిస్థాన్‌తో సంబంధాలున్నాయని, అంతేకాకుండా ఆయ న మన పొరుగు దేశాల్లో చేసిన పర్యటనలపై అనుమానాలున్నాయని లద్దాఖ్ డీజీపీ ఎస్డీ సింగ్ జామ్వాల్ వెల్లడించారు. కాగా, రాష్ట్ర హోదా కోసం ఇటీవల లద్దాఖ్‌లో ఆందోళనలు, హింసాయుత ఘటనలు చోటుచేసుకున్న క్రమంలో అప్పటి వరకు దీక్ష చేస్తున్న వాంగ్‌చుక్ దీక్ష విరమించగా, అల్లర్ల ప్రేరేపణకు ఆయనే కారణమని ఆరోపిస్తూ ప్రభుత్వం జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద శుక్రవారం అరెస్ట్ చేసి రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ సెంట్రల్ జైలుకు తరలించింది. దీనిపై డీజీపీ శనివారం మీడియాతో మాట్లాడారు.
వాంగుచుక్తో సంబంధం ఉన్న పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారి (పీఐఓ)ని అరెస్ట్ చేసినట్టు ఆయన చెప్పారు. ‘మేము ఇటీవల పాకిస్థాన్‌కు తిరిగి వస్తున్న ఆ దేశ ఇంటెలిజెన్స్ అధికారిని అరెస్ట్ చేశాం. అతను వాంగ్‌చుక్‌తో ఎప్పటికప్పుడు సంభాషణలు జరుపుతున్నాడు. అందుకు సంబంధించిన రికార్డులు మా దగ్గర ఉన్నాయి. అతను (సోనమ్ వాంగ్చూక్) పాకిస్థాన్‌లో జరిగిన డాన్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన బంగ్లాదేశ్‌ను కూడా సందర్శించారు. దీనిపై అనేక ప్రశ్నలు, అనుమానాలు తలెత్తుతున్నాయి. దీనిపై దర్యాప్తు జరుగుతున్నది’ అని డీజీపీ వెల్లడించారు. ఈ నెల 24న లేహ్‌లో జరిగిన హింసను ఆయన ప్రేరేపించారని ఆరోపించారు. అక్కడ అశాంతి నెలకొనడానికి ఆయనే కారణమని, ఆయన రెచ్చగొట్టే ప్రకటనలు చేశారని అన్నారు.