Sonam Wangchuk : లఢఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో చేర్చాలని పట్టుబడుతున్న పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk), ఆయన అనుచరులు నిరాహార దీక్ష విరమించారు. కేంద్ర హోంశాఖకు చెందిన అధికారులు ఆయనను కలిసి సానుకూలంగా స్పందించడంతో దీక్ష విరమణకు ఒప్పుకున్నారు. దాంతో అధికారులు ఆయనకు నిమ్మరసం అందజేసి దీక్ష విరమింపజేశారు.
డిసెంబర్ 3న లేహ్ ఎపెక్స్ బాడీ (LAB), కార్గిల్ డెమోక్రటిక్ అలయెన్స్ (KDA) ప్రతినిధులతో చర్చలు జరిపేందుకు కేంద్ర హోంశాఖ అంగీకరించడంపై వాంగ్‌చుక్ హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర హోంశాఖ అధికారులు, లద్దాఖ్ జాయింట్ సెక్రటరీ వచ్చి డిసెంబర్ 3న చర్చలకు హామీ ఇస్తూ అందుకు సంబంధించిన లేఖను అందజేశారని చెప్పారు. ఇదివరకు నిలిచిపోయిన చర్చలు డిసెంబర్ 3న కొనసాగుతాయని అన్నారు.
తమ ప్రధాన డిమాండ్ నెరవేరిందని, ఇరువర్గాల నుంచి నిజాయతీగా, సానుకూలంగా చర్చలు జరుగుతాయని భావిస్తున్నామని వాంగ్‌చుక్ ఆశాభావం వ్యక్తంచేశారు. లఢఖ్ను రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో చేర్చాలన్న డిమాండ్‌తో లేహ్ ఎపెక్స్ బాడీ (ఎల్ఏబీ), కార్గిల్ డెమోక్రటిక్ అలయెన్స్ (కేడీఏ) నేతృత్వంలో సోనమ్ వాంగ్‌చుక్ గత నెల 1న లేహ్ నుంచి ‘ఢిల్లీ చలో’ పాదయాత్రను చేపట్టారు. దాంతో పోలీసులు వారిని ఢిల్లీ సరిహద్దుల్లోనే అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం జంతర్‌మంతర్ వద్ద దీక్ష కోసం వాంగ్‌చుక్ పరివారం అనుమతి కోరగా పోలీసులు నిరాకరించారు. దాంతో ప్రత్యామ్నాయం లేక చివరకు తాను బస చేసిన లఢఖ్ భవన్ వద్దే దీక్షకు దిగారు. అక్టోబర్ 6న దాదాపు 18 మంది అనుచరులతో కలిసి నిరాహార దీక్షకు కూర్చున్నారు. లఢఖ్ను రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో చేరిస్తే స్థానిక జనాభా, వారి భూమి, సాంస్కృతిక గుర్తింపును రక్షించేందుకు చట్టాన్ని రూపొందించుకునే అధికారం లభిస్తుంది.