Sonam Wangchuk | లద్దాఖ్ (Ladakh) ఉద్యమకారుడు, వాతావరణ హక్కుల కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) అరెస్టయ్యారు. రాష్ట్రహోదా కల్పించాలని (Ladakh Statehood Clashes) డిమాండ్ చేస్తూ రెండు రోజుల క్రితం లద్దాఖ్‌లో ఆందోళనలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఘర్షణల్లో నలుగురు మరణించగా,100 మందికిపైగా గాయపడ్డారు. లద్దాఖ్‌లో హింసను రెచ్చగొట్టినట్టు సోనమ్ వాంగ్చుక్పై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిరసనలు జరిగిన నెండు రోజుల తర్వాత వాంగ్చుక్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలంటూ వాంగ్‌చుక్ నాయకత్వంలో నిరాహార దీక్ష చేస్తున్న 15 మందిలో ఇద్దరు వ్యక్తుల ఆరోగ్యం క్షీణించడంతో వారిని సెప్టెంబర్ 10న దవాఖానకు తరలించిన దరిమిలా ఎల్ఏబీ యువజన విభాగం బంద్‌కి పిలుపు ఇచ్చింది. మంగళవారం తన 15 రోజుల దీక్షను విరమించిన వాంగ్‌చుక్ హింసకు పాల్పడవద్దని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అయితే ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. ఆ తర్వాత లెహ్‌లో బీజేపీ కార్యాలయానికి నిప్పు పెట్టిన ఆందోళనకారులు దాని ఎదుట నిలిపి ఉన్న భద్రతా సిబ్బంది వాహనాన్ని దగ్ధం చేశారు. ఈ అల్లర్లకు వాంగ్‌చుక్‌కే కారణమని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన్ని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.
మరోవైపు సోనమ్ వాంగ్‌చుక్ ఏర్పాటు చేసిన స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ ఆఫ్ లద్దాఖ్‌కు (SECMOL) గతంలో జారీ చేసిన ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్‌ను కేంద్ర ప్రభుత్వం గురువారం రద్దు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వేతర సంస్థలు విదేశీ నిధులను స్వీకరించేందుకు అవకాశం కల్పించే చట్టాన్ని ఈ సంస్థ పదేపదే ఉల్లంఘించినట్లు తెలిపింది.
వాంగ్చుక్పై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దర్యాప్తు ప్రారంభమైంది. ఆయన ఏర్పాటు చేసిన హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ లద్దాక్ (హెచ్ఐఏఎల్)కు వస్తున్న నిధులపై దర్యాప్తు రెండు నెలల క్రితం ప్రారంభమైందని సీబీఐ అధికారులు చెప్పారు. ఆయన ఈ ఏడాది ఫిబ్రవరి 6న పాకిస్థాన్‌లో పర్యటించడంపై కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా ఇవ్వాలని, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూలులో చేర్చాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. దీని కోసం ఆయన ఇటీవల నిరాహార దీక్ష చేశారు.
నేపాల్ నిరసనలను గుర్తుకుతెస్తూ జనరేషన్ జెడ్ యువత లద్ధాఖ్‌లో ఆందోళనలు నిర్వహించింది. లద్ధాఖ్‌కి రాష్ట్రహోదా కల్పించడంతోపాటు, ఆరో షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకారులు బుధవారం లెహ్‌లో నిర్వహించిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ ఘర్షణల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. వంద మందికిపైగా గాయపడ్డారు. ఆందోళనకారులు స్థానిక బీజేపీ కార్యాలయాన్ని, ఓ వాహనాన్ని తగలబెట్టి, విధ్వంసానికి పాల్పడ్డారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులపై బాష్పవాయు గోళాలను ప్రయోగించడంతోపాటు లాఠీచార్జీ చేశారు. పరిస్థితులు అదుపుతప్పడంతో లెహ్ నగరంలో అధికారులు కర్ఫ్యూ విధించారు.
Also Read..
MiG-21 Fighter jet | రిటైర్ అయిన మిగ్-21 ఫైటర్ జెట్స్.. 62 ఏళ్ల సేవలకు గుడ్‌బై చెప్పిన వాయుసేన