పనాజీ: సోనాలీ ఫోగట్ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్నది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న సుధీర్ సంగ్వాన్, సుఖ్విందర్ సింగ్‌లను ఇవాళ అంజునా పోలీసులు స్థానిక కోర్టులో ప్రవేశపెట్టారు. నిందుతులను 10 రోజులపాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరారు. అందుకు కోర్టు అంగీకరించడంతో పోలీసులు నిందితులిద్దరినీ తమ కస్టడీలోకి తీసుకున్నారు.
బీజేపీ నాయకురాలు, టిక్‌టాక్ స్టార్ సోనాలీ ఫోగట్ ఆగస్టు 23న గోవాలోని అంజునా బీచ్‌లోగల కర్లీ రెస్టారెంట్లో జరిగిన ఓ పార్టీకి హాజరయ్యారు. అక్కడ సహచరుడు సుధీర్ సంగ్వాన్ మత్తు మందు కలిపి ఇచ్చిన డ్రింక్ తాగి అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత ప్రాణాలు కోల్పోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు సుధీర్ సంగ్వాన్‌ను, అతని సహాయకుడు సుఖ్విందర్ సింగ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఈ ఉదయం నిందితులిద్దరినీ కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం వారికి 10 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ఈ కేసులో ఇవాళ కర్లీ రెస్టారెంట్ ఓనర్, ఆ రోజు పార్టీకి డ్రగ్స్ సరఫరా చేసిన దత్ప్రసాద్ గోంకర్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.