లక్నో: బంధువు హత్య కేసులో కోర్టులో సాక్ష్యం చెప్పేందుకు ఒక సైనికుడు సెలవుపై ఇంటికి వచ్చాడు. రాత్రి వేళ భోజనం తర్వాత వాకింగ్‌కు వెళ్లిన అతడ్ని దుండగులు కాల్చి చంపారు. (Soldier Shot Dead) ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ముదిఖేడి గ్రామానికి చెందిన 27 ఏళ్ల విక్రాంత్ గుర్జార్ ఆర్మీ జవాన్. జమ్మూకశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్నాడు.
కాగా, నాలుగేళ్ల కిందట విక్రాంత్ బంధువైన రజత్‌ను కొందరు వ్యక్తులు కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ కేసులో కీలక సాక్షి అయిన ఆ జవాన్, కోర్టులో వాంగ్మూలం ఇచ్చేందుకు నాలుగు రోజుల సెలవుపై ఏప్రిల్ 8న గ్రామానికి వచ్చాడు. ఆ మరునాడు రాత్రి భోజనం తర్వాత వాకింగ్ కోసం బయటకు వెళ్లాడు. అయితే విక్రాంత్ ఇంటికి తిరిగి రాలేదు. మొబైల్ ఫోన్ కూడా స్విచ్చాఫ్‌లో ఉండటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.
మరోవైపు గురువారం తెల్లవారుజామున కాల్పుల గాయాలతో మరణించి రోడ్డు వద్ద పడి ఉన్న విక్రాంత్ మృతదేహాన్ని గ్రామస్తులు చూశారు. అతడి కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. విక్రాంత్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులను మోహరించారు. ఆర్మీ జవాన్ హత్యపై దర్యాప్తు చేస్తున్నారు.