Global Warming | హైదరాబాద్, నవంబర్ 12 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): భూతాపం కారణంగా జరుగుతున్న పర్యావరణ మార్పులతో అకాల వర్షాలు, కరువు-కాటకాలు, జీవ రాశి చట్రంలో మార్పులు, ఆహార సంక్షోభం ఇలా అనేక విపత్తులు నిత్యకృత్యమయ్యాయి. భూతాపానికి కారణమవుతున్న గ్రీన్‌హౌజ్ వాయువుల కట్టడికి వివిధ దేశాలు చేపట్టిన చర్యలు కూడా లక్ష్యాన్ని చేరడంలో విఫలమయ్యాయి. దీంతో భూతాపానికి చెక్ పెట్టడానికి ఓ బృహత్తర ప్రయోగం తెరమీదకు వచ్చింది. ఆరు విధాలుగా చేసే ఈ ప్రయోగానికి పలు కంపెనీలు ముందుకు రాగా.. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్, ఓపెన్ఏఐ సీఈవో సామ్ ఆల్ట్మాన్ తదితరులు నిధులు సమకూర్చడం గమనార్హం.
గ్రీన్‌హౌజ్ వాయువులపై సోలార్ రేడియేషన్ ప్రభావాన్ని తగ్గించి తద్వారా భూమి ఉష్ణోగ్రతలను చల్లబర్చడానికి ఉద్దేశించిన ప్రయోగమే ‘సోలార్ జియోఇంజినీరింగ్’. సూర్యరశ్మిని ప్రత్యేక మార్గాల ద్వారా రోదసిలోకి తిరిగి పంపించడమే ఈ ప్రయోగం లక్ష్యం. ప్రాథమికంగా ఆరు రకాలుగా ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నారు.
భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలో పెద్దపెద్ద రోదసి దర్పణాలను ఏర్పాటు చేస్తారు. సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు, ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉండే రేడియేషన్ కిరణాలు ఈ దర్పణాలపై పడి రోదసిలోకి తిరిగి ప్రసరిస్తాయి.
భూమికి 20 కిలోమీటర్ల ఎత్తులో స్ట్రాటోస్పియర్లో సల్ఫేట్ ఏరోసోల్ అనే రేణువులను పెద్దమొత్తంలో వెదజల్లుతారు. కాంతిని అడ్డుకొని వెనుకకు పంపించే గుణం వీటి సొంతం.
ఆకాశంలో వెంట్రుకల మాదిరి సన్నగా కనిపించే మేఘాలను సిర్రస్ క్లౌడ్స్ అని పిలుస్తారు. సూర్యరశ్మిని గ్రహించి భూ ఉపరితలానికి దాన్ని ప్రసరింపజేయడంలో ఇవి కీలకంగా వ్యవహరిస్తాయి. ఈ టెక్నిక్‌లో ఐస్ క్రిస్టల్స్‌ను పంపించి ఈ సిర్రస్ మేఘాలను వాతావరణంలో కలిసిపోయేలా చేస్తారు.
సూర్యరశ్మిని గ్రహించి తిరిగి వాతావరణంలోకి ప్రసరించేలా చేసే జనపనార, బార్లీ, లే, వింటర్ వీట్ వంటి హైఆల్బిడో క్రాప్స్ లేదా షైనర్ క్రాప్స్‌ను విరివిగా పెంచుతారు. పెద్దపెద్ద భవనాల మీద దర్పణాలను అమర్చుతారు.
సముద్రపు నీటిలోకి సూక్ష్మమైన నీటి బుడగలను పంపిస్తారు. దీంతో నీటి ఉపరితలంపై పడ్డ సూర్యరశ్మి తిరిగి పైకి వెళ్లిపోతుంది.
దట్టమైన మేఘాలు ఉన్న చోట ఓడల మీద నుంచి అత్యధిక పీడనంతో సాల్ట్‌ను పైకి స్ప్రేగా వదులుతారు. దీంతో ఆయా మేఘాలు సూర్యరశ్మిని తిరిగి రోదసిలోకి పంపించి వేస్తాయి.