Software Engineer | బెంగళూరు: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒకరికొకరు మాట్లాడుకోవడమే గగనంగా మారింది. ఉన్నత చదువులు చదివి, నగరాల్లో ఉద్యోగాలు చేస్తూ, కుటుంబ సభ్యులకు దూరంగా ఉండేవారు ఒంటరితనంతో సతమతమవుతున్నారు. నలుగురితో కలివిడిగా మాట్లాడాలన్న కోరికతో ఇటువంటివారు రకరకాల వ్యాపకాలు చేసుకుంటున్నారు. తాజాగా ఓ నెటిజన్ ఇటువంటి సంఘటనను వెలుగులోకి తీసుకొచ్చారు. కోరమంగళలో తాను ఓ ఆటోను బుక్ చేసుకున్నానని, ఆ ఆటో డ్రైవర్ మైక్రోసాఫ్ట్ లోగో ఉన్న హుడీని ధరించడంతో ఆశ్చర్యపోయానని చెప్పారు.
ఆయనతో మాటలు కలిపినపుడు తాను మైక్రోసాఫ్ట్ ఇంజినీర్‌నని, ఒంటరితనాన్ని భరించలేక, నలుగురితో మాట్లాడే అవకాశం కోసం వారాంతాల్లో ఆటో నడుపుతున్నట్లు చెప్పారని తెలిపారు. గతంలో ఓ మహిళ ఇచ్చిన పోస్ట్‌లో, తాను బుక్ చేసుకున్న ర్యాపిడో డ్రైవర్ ఓ ప్రముఖ కార్పొరేట్ సంస్థలో మేనేజర్ అని తెలుసుకుని ఆశ్చర్యపోయానని చెప్పిన సంగతి తెలిసిందే. బెంగళూరు నగరంలో ఇటీవల ఇటువంటి సంఘటనలు తరచూ కనిపిస్తున్నాయి.