Chandrayan-3 | జాబిల్లి రావే.. అని పాడుతుంటే గోరుముద్ద తినని పసిబిడ్డలుంటారా? చందమామ కథ చెప్తే కానీ కన్నుమలగని పిల్లలుంటారా? నెలరాజును మామను చేసి.. చిన్ననాటినుంచే చుట్టరికం కలిపిన నేల మనది. దేవుడిని చేసి పూజిస్తున్న ధాత్రి ఇది. చంద్రకళల్ని శాస్త్రంగా రాసుకుని, చంద్రవంశాన్ని పురాణాల్లో నిలుపుకొన్నది. వేల ఏండ్లుగా మానవాళిని ఊరిస్తున్న ఆకాశఫలం.. చందమామ! ఆధునిక సాంకేతికతతో అంతరిక్షానికి నిచ్చెన వేస్తున్న భారత్.. ఇప్పుడిక అందాల చంద్రుడిని అందుకోబోతున్నది.
వెన్నెలరాజ్యంలోని నిగూఢ రహస్యాలను ఛేదించేందుకు చేపట్టిన చంద్రయాన్-3 శుక్రవారం విజయవంతంగా ప్రారంభమైంది. దేశం మొత్తం మునివేళ్లపై నిలిచి ఉత్కంఠగా ఎదురుచూస్తున్న వేళ.. శ్రీహరికోట నుంచి బాహుబలి రాకెట్ ఎల్వీఎం3-ఎం4 నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగిసింది. సరిగ్గా 16నిమిషాల తర్వాత భూకక్ష్యలోకి ప్రవేశించింది. 40 రోజుల తర్వాత ఆగస్టు 23న జాబిల్లి దక్షిణ ధ్రువంపై భారత రోవర్ అడుగుపెట్టనున్నది.
శ్రీహరికోట: భారతదేశం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ప్రతిష్ఠాత్మక చంద్రయాన్-3 ప్రయాణం విజయవంతంగా ప్రారంభమైంది. జంబో రాకెట్ ఎల్వీఎం3-ఎం4 ద్వారా చంద్రయాన్‌ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలకు విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోటలోని సతీశ్‌ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం లాంచ్పాడ్-2 నుంచి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగాన్ని తిలకించిన వేలమంది కేరింతలు కొట్టారు. రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఇస్రోకు శుభాకాంక్షలు తెలిపారు.
40 రోజులపాటు సాగే చంద్రయాన్-3 ప్రయాణం సాఫీగా మొదలైంది. ప్రయోగించిన 16 నిమిషాల తర్వాత చంద్రయాన్‌ను నిర్ణీత కక్ష్యలోకి చేర్చి రాకెట్ వేరుపడింది. ప్రస్తుతం చంద్రయాన్ భూమిచుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరుగుతున్నది. భూమికి అత్యంత సమీపంగా 170 కిలోమీటర్లు, అత్యంత దూరంగా 36,500 కిలోమీటర్ల కక్ష్యలో పరిభ్రమిస్తున్నది. ఆగస్టు 1 నుంచి చంద్రయాన్ చంద్రుడి కక్ష్యలోకి చేరుకోవటం మొదలవుతుందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు.
అత్యంత కీలకమైన ల్యాండింగ్ ప్రక్రియను వచ్చే నెల 23న చేపట్టనున్నట్టు ఎస్ సోమనాథ్ తెలిపారు. ఆగస్టు 23న సాయంత్రం 5.47 గంటలకు ల్యాండర్ చంద్రుడిపై దిగుతుందని ప్రకటించారు. ప్రస్తుతానికి అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయని ప్రాజెక్ట్ డైరెక్టర్ పీ వీరముత్తువేల్ తెలిపారు.
చంద్రుడిపై ప్రయోగాల్లో అత్యంత క్లిష్టమైనది ఉపరితలంపై సురక్షితంగా దిగటమే. ఇప్పటివరకు చంద్రుడిపై అమెరికా, పూర్వపు సోవియట్ యూనియన్, చైనా మాత్రమే తమ ల్యాండర్లను సురక్షితంగా దింపగలిగాయి. చంద్రయాన్-2 ద్వారా భారత్ ప్రయోగించిన విక్రమ్ ల్యాండర్ చివరి క్షణంలో విఫలమైంది. ఈ ప్రక్రియను ‘15 నిమిషాల టెర్రర్’ అని ఇస్రో మాజీ చైర్మన్ కే శివన్ అభివర్ణించారంటే అది ఎంతటి కష్టసాధ్యమైనదో అర్థం చేసుకోవచ్చు. భూమిపైలాగా చంద్రుడిపై వాతావరణం ఉండదు. చందమామపై ల్యాండర్‌ను దింపేటప్పుడు గురుత్వాకర్షణకు లోనై అది కూలిపోకుండా ఉండేందుకు వేగాన్ని క్రమంగా తగ్గిస్తూ ఉండాలి. అందుకోసం అందులో ఉంచిన రాకెట్లను మండిస్తారు. ఈ ప్రక్రియ మొత్తం ముందుగా నిర్ణయించినట్టుగానే సాగాలి. కానీ, ఇందులో అనేక సవాళ్లు ఎదురవుతాయి. ఇప్పటివరకు 37 శాతం ప్రయోగాలే విజయవంతమయ్యాయి.
చంద్రయాన్-3 విజయవంతం కావడంతో 73 రోజులుగా తాము పడ్డ కష్టానికి తగ్గ ఫలితం వచ్చిందని శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. చంద్రయాన్-3 విజయవంతంగా నిర్ణీత కక్ష్యలోకి చేరుకోవడంతో తమ తపస్సు ఫలించిందని మిషన్ డైరెక్టర్ మోహన కుమార్ తెలిపారు. మానవ సహిత యాత్ర గగన్‌యాన్‌కు ఎల్వీఎం-3 రాకెట్ వినియోగిస్తున్నందున దాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. ఎల్వీఎం రాకెట్‌తో ఇప్పటివరకు ఏడు ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించినట్టు విక్రమ్ సారాబాయి స్పేస్ సెంటర్ డైరెక్టర్ ఉన్నికృష్ణన్ వెల్లడించారు.
భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ -3 బడ్జెట్ విషయంలోనూతన ప్రత్యేకతను చాటుకున్నది. చాలా తక్కువ ఖర్చుతోనే జాబిల్లిపై ఇస్రో ప్రయోగాలు చేస్తున్నది. చంద్రయాన్-3 ప్రయోగానికి అయిన వ్యయం ఇటీవల విడుదల అయిన ఆదిపురుష్ సినిమా కంటే తక్కువ కావడం గమనార్హం. ఆదిపురుష్ సినిమాను సుమారు రూ.700 కోట్లతో నిర్మించగా, రూ.615 కోట్ల బడ్జెట్‌తోనే చంద్రయాన్-3 ప్రయోగాన్ని చేపట్టడం విశేషం. దీనిపై అనేకమంది నెటిజన్లు సోషల్ మీడియాలో ఇస్రోను కీర్తిస్తూ పోస్టులు పెడుతున్నారు. చంద్రయాన్-1 తక్కువ ఖర్చుతోనే రూపుదిద్దుకున్నది.
చంద్రయాన్-3లో భాగంగా పంపిన రోవర్ చంద్రుడిపై ఒక్కరోజు మాత్రమే పనిచేస్తుంది. చంద్రుడిపై ఒక రోజు అయితే భూమిపై 14 రోజులు అన్నమాట. ఈ రోవర్ చంద్రుడిపై ఒకరోజు పరిశోధన చేస్తే, 14 రోజులపాటు అధ్యయనం చేసినట్టు మనం భావించాలి. చంద్రయాన్-3 రోవర్ జీవితకాలం ఒక్కరోజేనని ఇస్రో వర్గాలు తెలిపాయి. ఈ ఒక్కరోజులోనే నిర్దేశిత ప్రయోగాలన్నీ చేస్తుందని వెల్లడించాయి.
ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ విడిపోయిన తర్వాత అది చంద్రుడి ఉపరితలం దిశగా ప్రయాణిస్తుంది. ఆ సమయంలో దాని వేగాన్ని, పక్కలకు స్వింగ్ అయ్యే వేగాన్ని నియంత్రించాల్సి ఉంటుందని చంద్రయాన్-2లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ల్యాండర్ వేగాన్ని సెకనకు మూడు మీటర్లకు తగ్గించాలి. వేగ నియంత్రణ కోసం ఆ సమయంలో థ్రస్టర్ల (ఇంజిన్లు)ను మండిస్తారు. ఈ ఏడాది జపాన్ పంపిన హకుటో-ఆర్ ల్యాండర్ కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొని విఫలమైంది. భారత్ పంపిన చంద్రయాన్-2 కూడా సాఫ్ట్వేర్ సమస్యల కారణంగా ల్యాండింగ్‌లో ఇటువంటి సమస్యనే ఎదుర్కొని కుప్పకూలింది.
చంద్రుడిపై వాతావరణం లేకున్నప్పటికీ భూమితో పోలిస్తే ఆరోవంతు గురుత్వాకర్షణ శక్తి కలిగి ఉంది. కాబట్టి చంద్రయాన్ వంటి మిషన్లు విజయవంతం చేయాలంటే దీనిని కూడా సరిగ్గా అర్థం చేసుకుని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉండడం వల్ల ల్యాండర్ అవరోహణపై మరింత కచ్చితత్వం అవసరం. ఇది ల్యాండర్ థ్రస్టర్లపై భారం పెంచుతుంది. సరైన శక్తితో సరైన సమయంలో సరైన స్థాయిలో ఇంజిన్లు మండాల్సి ఉంటుంది. ల్యాండర్ కిందికి జారుతున్న వేగాన్ని నియంత్రించడంలో ఏ చిన్న తేడా జరిగినా ల్యాండర్ కూలిపోవడం ఖాయం.
విక్రమ్ ల్యాండర్ ఆర్ఏఎంబీహెచ్ఏ, ఐఎల్ఎస్ఏ పే లోడ్లను తనతో పాటు తీసుకెళ్తున్నది. ఇన్స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సిస్మిక్ యాక్టివిటీ (ఐఎల్ఎస్ఏ) చంద్రుడి ఉపరితలంపై ల్యాండింగ్ సైట్ వద్ద చంద్రుడి కంపాలపై ఇది పరిశోధనలు చేస్తుంది. ఇది గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే ల్యాండర్ దిగుతుంది. రేడియో అనాటమీ ఆఫ్ మూన్ బౌండ్ హైపర్సెన్సిటివ్ అయానోస్పియర్, అట్మాష్పియర్ (ఆర్ఏఎంబీహెచ్ఏ) ప్లాస్మా సాంద్రతపై అధ్యయనం చేస్తుంది. కాలానుగుణంగా మార్పులను తెలుసుకుంటుంది.
ఏడు దశాబ్దాల్లో చంద్రుడిపై చేసిన ప్రయోగాల్లో సగం మాత్రమే సక్సెస్ అయ్యాయని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ తెలిపింది. ఇప్పటి వరకు 111 లూనార్ మిషన్స్‌ను ప్రయోగించగా.. 62 విజవంతమయ్యాయని ఆ సంస్థ ప్రకటించింది. చంద్రయాన్-3 విజయవంతమైతే చంద్రుడిపై సక్సెస్‌ఫుల్‌గా అంతరిక్ష నౌకను దింపిన నాలుగో దేశంగా అమెరికా, చైనా, రష్యాల సరసన భారత్ చేరుతుందని తెలిపింది. 1969లో అమెరికా వ్యోమగాములు చంద్రుడిపై కాలుమోపి సువర్ణాధ్యాయాన్ని లిఖించారు.
2003, ఆగస్టు 15: చంద్రయాన్ గురించి నాటి ప్రధాని వాజపేయి మొదటిసారి ప్రకటించారు.
2008, అక్టోబర్ 22: షార్ నుంచి చంద్రయాన్-1 విజయవంతంగా నింగిలోకి దూసుకుపోయింది.
2008, నవంబర్ 8: చంద్రయాన్-1 చంద్రుడి కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది.
2008, నవంబర్ 14: చంద్రయాన్-1 నుంచి మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ బయటకు వచ్చి చంద్రుడి ఉపరితలంపై దక్షిణ ధ్రువంపై పడింది. ఇది చంద్రుడి ఉపరితలం కింద నీరు ఘనరూపంలో ఉన్నదని కచ్చితమైన సమాచారాన్ని ప్రపంచానికి తెలిపింది.
2009, ఆగస్టు 28: చంద్రయాన్-1 జీవితకాలం ముగిసినట్టు ఇస్రో ప్రకటించింది.
2019, జూలై 22: చంద్రయాన్-2ను షార్ నుంచి ప్రయోగించారు.
2019, ఆగస్టు 20: చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్-2 విజయవంతంగా ప్రవేశించింది.
2019, సెప్టెంబర్ 2: చంద్రుడి ఉపరితలానికి 100 మీటర్ల ఎత్తులో ధ్రువ కక్ష్యలో పరిభ్రమిస్తున్న వ్యోమనౌక నుంచి విక్రమ్ ల్యాండర్ వేరుపడి చంద్రుడి ఉపరితలంపై దిగటం మొదలైంది. ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల వరకు చేరుకొన్న తర్వాత భూమిపై ఇస్రో గ్రౌండ్ స్టేషన్‌తో దానికి సంబంధాలు తెగిపోయాయి. విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై కూలిపోయిందని ఆ తర్వాత ఇస్రో ప్రకటించింది.
2023, జూలై 14: చంద్రయాన్-3 విజయవంతంగా నింగిలోకి ఎగిసి, నిర్దేశిత భూ కక్ష్యలోకి చేరింది.
2013, ఆగస్టు 23/24: చంద్రయాన్- 3 ల్యాండర్ చందమామపై దిగనున్నది.
చంద్రయాన్ -3 ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన ఇస్రో శాస్త్రవేత్తలు, సిబ్బందికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతం అవడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. భారత ఖగోళ రంగంలో ఇది కీలక మైలురాయి అని పేర్కొన్నారు. అంతరిక్ష రంగంలో దేశం సాధించిన పురోగతికి ఇది నిదర్శనమని తెలిపారు.
హైదరాబాద్(నమస్తే తెలంగాణ): చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం అవడంపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. మొదటి దశ విజయవంతం కావడం ద్వారా భారత అంతరిక్ష పరిశోధన రంగం కీలక మైలురాయిని దాటిందని సీఎం తెలిపారు.