రాంచి: స్కూల్ హాస్టల్లోకి విషపూరిత పాము చొరబడింది. నిద్రిస్తున్న నలుగురు అమ్మాయిలను అది కాటేసింది. ఈ సంఘటనలో ఒక బాలిక మరణించింది. మరో ముగ్గురు అమ్మాయిలకు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. (Snake Bites Sleeping Girls) జార్ఖండ్‌లోని లోహర్దగా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కుడూ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంసిరా హయ్యర్ సెకండరీ రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్లోకి రాత్రివేళ విషపూరిత పాము ప్రవేశించింది. హాస్టల్ గదిలో నిద్రిస్తున్న నలుగురు బాలికలను ఆ పాము కాటువేసింది. గమనించిన మిగతా విద్యార్థులు భయాందోళన చెందారు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న టీచర్ వెంటనే స్పందించారు. పాము కాటేసిన బాలికలను సదర్ ఆసుపత్రికి తరలించగా ఒక విద్యార్థిని మరణించింది. మృతురాలిని సాల్గి అలౌది నవ టోలికి చెందిన 12 ఏళ్ల వర్ష ఓరాన్‌గా గుర్తించారు. పాము కాటులో గాయపడిన 14 ఏళ్ల మనీషా కుమారి సదర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. 11 ఏళ్ల ఫుల్మానియా ఒరాన్, 11 ఏళ్ల అనిసా కుమారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం రిమ్స్‌కు తరలించారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న బాలికల కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రికి వద్దకు చేరుకున్నారు. ఆసుపత్రి ప్రాంగణంలో గుమిగూడి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కూడా ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. హాస్టల్లో నిద్రిస్తున్న బాలికలను పాము కాటు వేసిన సంఘటనలో ఒక విద్యార్థిని మరణించడంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.