Smoke bomb : భారత్–చైనా దేశాల మధ్య 1962లో జరిగిన యుద్ధం సమయంలో చైనా వినియోగించిన మోర్టార్ స్మోక్ బాంబు అస్సాంలో లభ్యమైంది. ఇది చైనాలో తయారు చేసిన బాంబు అని సోనిత్ పూర్ ఎస్పీ తెలిపారు. 1962 యుద్ధంలో ఈ బాంబును దట్టమైన పొగను వ్యాపింపజేయడానికి ఉపయోగించినట్లు చెప్పారు. అస్సాంలోని సోనిత్ పూర్ జిల్లాలో ఈ మోర్టార్ స్మోక్ బాంబును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
జౌగాపూర్ గ్రామంలో శుక్రవారం సాయంత్రం సేసా నదిలో ఓ వ్యక్తి చేపల వేటకు వెళ్లాడు. నదిలో రెండు అంగుళాల పొడవు కలిగిన పేలుడు పదార్థాన్ని గుర్తించాడు. దానిని బయటకు తీసుకొచ్చాడు. ఈ విషయాన్ని స్థానిక మిషనరీ పోలీస్ స్టేషన్లో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అతని వద్దకు చేరుకుని స్మోక్ బాబును స్వాధీనం చేసుకున్నారు.
సోనిత్ పూర్ ఎస్పీ బరున్ పుర్కాయస్త ఇచ్చిన సమాచారం మేరకు ఆర్మీ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. లెఫ్టినెంట్ కల్నల్ అభిజిత్ మిశ్రా నేతృత్వంలోని మిసామరి క్యాంప్‌కు చెందిన ఆర్మీ బృందం ఆ మోర్టార్ స్మోక్ బాంబును ధ్వంసం చేసింది. ఈ మోర్టార్ స్మోక్ బాంబు ఒక రకమైన మందుగుండు సామాగ్రి. శత్రువుల కాల్పులను నివారించడానికి, శత్రువుల నిఘా నుంచి తప్పించుకోవటానికి ఈ స్మోక్ బాంబును వినియోగించేవారని ఎస్పీ తెలిపారు.