Tax notice : చిన్న స్వీట్ షాప్ (Sweet shop) నిర్వహిస్తున్న ఓ చిరువ్యాపారికి ఏకంగా రూ.141 కోట్ల పన్ను నోటీస్ (Tax Notice) జారీ అయ్యింది. దాంతో ఆ షాప్ ఓనర్ షాక్‌కు గురయ్యాడు. ఈ ఘటన ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. యూపీలోని బులంద్‌షహర్ (Buland Shahr) ప్రాంతంలో ఓ చిన్న స్వీట్ దుకాణం నడుపుతున్న సుధీర్ (Sudheer) అనే వ్యక్తికి రూ.141 కోట్లకు పైగా అమ్మకాలపై ఆదాయపు పన్ను విభాగం (Income Tax Department) అధికారుల నుంచి వచ్చిన నోటీసు చూసి కంగుతిన్నాడు.
వెంటనే పోలీస్‌స్టేషన్‌కు పరుగులు తీసి ఫిర్యాదు చేశాడు. తనకు సంబంధంలేని కంపెనీ అమ్మకాలపై 2022లో కూడా సీజీఎస్టీ కార్యాలయం నుంచి పన్ను నోటీస్ అందిందని, ఆ కంపెనీలతో తనకు ఎలాంటి సంబంధం లేదని అప్పుడే పన్ను విభాగ అధికారులకు వివరించానని తెలిపాడు. మళ్లీ జూలై 10న తాను రూ.141 కోట్ల అమ్మకాలు చేసినట్లు మరో నోటీస్ వచ్చిందన్నాడు. ఆ నోటీస్‌లో తన పేరు, చిరునామా, పాన్ నంబర్ ఉండటమే కాకుండా.. తాను ఢిల్లీలో ఆరు కంపెనీలను నడుపుతున్నట్లు ఉందని చెప్పాడు.
అయితే దీనిపై బాధితుడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కొందరు ఆర్థిక, సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతాలు తెరవడానికి, షెల్ కంపెనీలను సృష్టించడానికి, రుణాలు పొందడానికి లేదా పన్నులు ఎగవేసేందుకు ఎవరైనా మరొక వ్యక్తి పాన్ వివరాలను చట్టవిరుద్ధంగా ఉపయోగిస్తుంటారని అధికారులు వెల్లడించారు. ఇటువంటి మోసాలు పన్ను నోటీసులు వచ్చినప్పుడో లేదంటే రికవరీ కాల్స్ వచ్చినప్పుడో బయటపడుతుందని చెప్పారు.
కాబట్టి ప్రజలు తమ పాన్‌కార్డు వివరాలను బయటి వ్యక్తులతో పంచుకోవద్దని, తమ క్రెడిట్ నివేదికలను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకుంటూ ఉండాలని సూచించారు. పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయడం వల్ల ఇలాంటి మోసాలను చాలావరకు అరికట్టవచ్చని సూచించారు. ఇదిలావుంటే ఇటీవల ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ పారిశుద్ధ్య కార్మికుడికి కూడా రూ.34 కోట్ల అమ్మకాలపై పన్ను చెల్లించాలని నోటీసులు అందాయి. దాంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.