న్యూఢిల్లీ : జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ విధాన రూపకల్పన (ఎన్పీఎఫ్ఏఎం)ను సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఏకగ్రీవంగా తిరస్కరించింది. ఇవి మూడు వ్యవసాయ చీకటి చట్టాలకు పునర్జన్మలా ఉందని, దీనికి వ్యతిరేకంగా అన్ని రాష్ర్టాల్లో పక్కా మోర్చా (బైఠాయింపు నిరసన)లు నిర్వహించనున్నట్టు తెలిపింది. సుర్జీత్ భవనంలో జరిగిన ఎస్కేఎం సర్వసభ్య సమావేశం అనంతరం సంఘం ఈ ప్రకటన చేసింది. 12 రాష్ర్టాల నుంచి 73 రైతు సంఘాలకు చెందిన 165 మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ విధానం ప్రభుత్వ మార్కెట్లపై క్రూరమైన దాడిగా వర్ణించిన నేతలు ఇవి కేవలం ఎంఎన్సీ, కార్పొరేట్లకు మాత్రమే ప్రయోజనాన్ని కలిగిస్తాయని ఆరోపించారు. ఈ విధానం రైతు, రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకిగా ఉందని ఎస్కేఎం పేర్కొంది. దీనికి నిరసనగా తమ ఆందోళన తర్వాతి దశలో భాగంగా మార్చి 5 నుంచి దేశవ్యాప్తంగా బైఠాయింపు నిరసనలను చేపట్టాలని పిలుపునిచ్చింది.