Uttar Pradesh : ఉత్తర ప్రదేశ్లోని బదౌన్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక ఈ రిక్షా.. ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను ఢీకొంది. ఈ ఘటనలో ఆరుగురు మహిళలు మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్, బదౌన్ జిల్లాలో, బరేలి-మధుర హైవేపై బుధవారం మధ్యాహ్నం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గర్హౌనా గ్రామానికి చెందిన ఎనిమిది మంది మహిళలు ఒక ఈరిక్షాలో బంధువుల ఇండ్లకు బయల్దేరారు.
తమ ఇంట్లో పెళ్లికి ఆహ్వానించడానికి వెళ్లారు. ఈ క్రమంలో హైవేపై వెళ్తుండగా, ముందు ఉన్న ట్రాక్టర్ను దాటుకొని ముందుకు వెళ్లేందుకు ఈరిక్షా డ్రైవర్ ప్రయత్నించాడు. ఒక ట్రాక్టర్ను దాటుకుని వెళ్తుండగా, ఎదురుగా వేగంగా వస్తున్న మరో ట్రాక్టర్ను ఈరిక్షా ఢీకొంది. ఈ ఘటనలో ఆటోలోని మహిళల్లో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. ఆటో డ్రైవర్ షాని సహా మరో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జైంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు అక్కడికి చేరుకుని వారిని రక్షించే ప్రయత్నంచేశాయి. కానీ, అప్పటికే ఆరుగురు మరణించారు. గాయపడిన ముగ్గురిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతదేహాల్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ రిక్షా డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
మరోవైపు ఘటనకు కారకులైన రెండు ట్రాక్టర్లకు చెందిన డ్రైవర్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. మృతుల కుటుంబాలకు సంబంధించిన వారి ఇంట్లో ఈ నెల 29న వివాహం జరగాల్సి ఉంది. మరోవైపు ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.