శ్రీనగర్, జూలై 7: జమ్ము కశ్మీర్లోని కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు నిర్వహించిన రెండు ఎన్కౌంటర్లలో మృతి చెందిన ముష్కరుల సంఖ్య ఆరుకు చేరింది. సుదీర్ఘంగా సాగిన ఆపరేషన్లలో ఆరుగురు ఉగ్రవాదులు మరణించినట్టు జమ్ము కశ్మీర్ డీజీపీ ఆర్ఆర్ స్వయిన్ తెలిపారు. మడెర్గాంలో ఇద్దరు, చిన్నిగాంలో నలుగురు ఉగ్రవాదుల మృతదేహాలను ఆదివారం గుర్తించినట్టు అధికారులు తెలిపారు. కాగా, రాజౌరి జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్లో జమ్ము కశ్మీర్లో ఇటీవల పెరిగిన ఉగ్రవాద కార్యకలాపాల వెనుక లష్కరే తోయిబాకు చెందిన రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉన్నట్టు భద్రతా దళాలు భావిస్తున్నాయి.
13 అసెంబ్లీ స్థానాలకు 10న ఉప ఎన్నికలు
న్యూఢిల్లీ: పలు రాష్ర్టాల్లో అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఏడు రాష్ర్టాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 10న ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు 13న వెలువడతాయి. వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు కొంతమంది రాజీనామా చేయ టం, మరి కొంతమంది మరణించటంతో ఆయా స్థానాలు ఖాళీ అయ్యాయి.
పీఎం జన ఆరోగ్య యోజన కవరేజీ రెట్టింపు!
న్యూఢిల్లీ: ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన (ఏబీపీఎంజేఏవై) లబ్ధిదారులను మూడేళ్లలో రెట్టింపు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. వయసు 70 ఏళ్లు పైబడినవారందరినీ దీని పరిధిలోకి తేవాలనుకుంటున్నది. అదేమ విధంగా బీమా కవరేజిని సంవత్సరానికి ప్రస్తుతం ఉన్న రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెంచాలని కేంద్రం యోచిస్తున్నది. నేషనల్ హెల్త్ అథారిటీ దీనికి సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఇది అమల్లోకి వస్తే దేశంలోని మూడింట రెండొంతుల మంది ఈ బీమాకు అర్హులవుతారు.