ఇండోర్: మధ్యప్రదేశ్లోని బర్వానీ జిల్లాలోని లింబాయి గ్రామం, దాని చుట్టు పక్కల ఉన్న రెండు గ్రామాల్లో గుర్తు తెలియని జంతువు చేసిన దాడిలో ఆరుగురు మృతి చెందారు. దాడి చేసింది హైనా అని గ్రామస్థులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు ఆ జంతువు పాద ముద్రలను సేకరించి దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
మే 5న గ్రామస్థులు కొందరు ఇండ్ల బయట నిద్రపోతుండగా ఓ జంతువు దాడి చేసి 18 మందిని గాయపరిచింది. వీరందరికీ యాంటీ రేబిస్ టీకా వేసినప్పటికీ.. అందులో ఆరుగురు ఇటీవల పది రోజుల వ్యవధిలో మరణించారు. దాడి చేసిన జంతువుకు రేబిస్ వ్యాధి ఉండొచ్చని, ఆ కారణంగానే బాధితుల్లో ఆరుగురుకి రేబిస్ వ్యాధి సోకి వారు మృతి చెంది ఉండొచ్చని భావిస్తున్నారు.