Road Accident : ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి బోల్తాపడటంతో ఆరుగురు అక్కిడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో 21 మంది గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) రాష్ట్రం ఉన్నవ్ జిల్లా (Unnav district) లో ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వే (Agra-Lucnow Expressway) పై మంగళవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఢిల్లీ నుంచి బీహార్ వైపు వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. అరస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్స్‌ప్రెస్‌వేపై 262వ కిలోమీటర్ మైలురాయి దగ్గర జరిగిన ఈ ప్రమాదం గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. ప్రమాదంలో మృతిచెందిన వారిలో ఒక సబ్ఇన్స్పెక్టర్, ఒక ఖైదీ ఉన్నట్లు అరస్ ఎస్వో సంజీవ్ కుశ్వాహా తెలిపారు. మరణించిన సబ్-ఇన్స్పెక్టర్ను రామచంద్రగా గుర్తించారు. తన విధి నిర్వహణలో భాగంగా ఖైదీ ఛత్రపాల్‌ను సివాన్ నుంచి ఢిల్లీకి తీసుకెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రమాదం జరిగిన వెంటనే హైవే అథారిటీ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సు శిథిలాల నుంచి మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన 10 మందికిపైగా ప్రయాణికుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని మెరుగైన చికిత్స కోసం లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ ట్రామా సెంటర్‌కు తరలించారు. ఘటనపై ఉన్నవ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.