తిరువనంతపురం: శబరిమల బంగారం చోరీ కుంభకోణాన్ని దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) మరిన్ని సంచలన విషయాలు బయటపెట్టింది. ఆలయంలోని మరిన్ని కళాకృతుల నుంచి కూడా బంగారం మాయం అయినట్లు సిట్ కొల్లాంలోని విజిలెన్స్ కోర్టుకు సమర్పించిన నివేదికలో తెలిపింది. కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు ప్రారంభించిన సిట్ ద్వారపాలక విగ్రహాలు, ఆలయ గర్భగుడి తలుపు రెక్కల నుంచి బంగారం మాయమైనట్లు రెండు కేసులు నమోదు చేసింది.
అయితే బంగారం చోరీ రెండు కళాకృతులకే పరిమితం కాలేదని పేర్కొన్న సిట్ ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న నిందితులను తమ కస్టడీకి అప్పగించాలని కోరింది. ఆలయంలోని ప్రభ మండలం వద్ద ఉన్న ఏడు రాగి రేకుల నుంచి బంగారం మాయమైందని సిట్ తెలిపింది. చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్స్ వద్ద ఓ రసాయన మిశ్రమాన్ని ఉపయోగించి బంగారాన్ని వేరుచేయడం జరిగిందని, ప్రస్తుతం అది బళ్లారి నగల వ్యాపారి వద్ద ఉందని సిట్ తన నివేదికలో పేర్కొన్నది.