తిరువనంతపురం: మలయాళం సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేయాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. కొందరు అగ్ర నటులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు వచ్చిన ఆరోపణలపై మహిళా అధికారి నేతృత్వంలోని సిట్ చేత దర్యాప్తు జరిపిస్తామని తెలిపింది. జస్టిస్ కే హేమ కమిటీ నివేదిక నేపథ్యంలో సమగ్ర దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్.. ముఖ్యమంత్రి పినరయి విజయన్ను డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. మలయాళం సినీ పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపులు, అనుచిత ప్రవర్తన, ఇతర మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నట్లు హేమ కమిటీ నివేదిక వెల్లడించింది.
యూపీఎస్‌పై మాటల యుద్ధం
న్యూఢిల్లీ: ‘యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్’ (యూపీఎస్)పై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఎన్డీయే సర్కార్ పలు నిర్ణయాలపై ‘యూటర్న్’ తీసుకుంటున్నదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. యూపీఎస్‌లో ‘యూ’ అంటే యూనిఫైడ్ కాదని, యూటర్న్ అని ఎద్దేవా చేశారు. దీనిపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందిస్తూ, యూపీఎస్ తీసుకురావటం కాంగ్రెస్‌కి కంటగింపుగా మారిందని అన్నారు. ‘పాత పెన్షన్ విధానాన్ని తీసుకొస్తామని హిమాచల్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఎప్పుడు అమలుజేస్తారని రాహుల్ ని ప్రశ్నిస్తున్నా’ అని కేంద్ర మంత్రి అన్నారు.
పారిస్‌లో టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్ అరెస్టు
ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే అదుపులోకి!
పారిస్: ప్రముఖ మెసేజింగ్, ఆడియో కాలింగ్ యాప్ ‘టెలిగ్రామ్’ వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్ దురోవ్‌ను ఫ్రెంచ్ పోలీసులు అరెస్టు చేశారు. అజర్బైజాన్ నుంచి పారిస్‌కు చేరుకున్న ఆయన్ని శనివారం సాయంత్రం ఇక్కడి పారిస్ లె బోర్గెట్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నట్టు ఫ్రెంచ్ మీడియా పేర్కొన్నది. దురోవ్‌ను పోలీస్ కస్టడీలో ఉంచారని తెలిసింది. ‘టెలిగ్రామ్’ యాప్ మనీలాండరింగ్ కార్యకలాపాలకు ఉపయోగపడుతున్నదని, మైనర్లపై లైంగికదాడులు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు ‘టెలిగ్రామ్’లోని కంటెంట్ దోహదపడుతున్నదని దురోవ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.