తిరువనంతపురం: కేరళలోని శబరిమల (Sabarimala Gold Scam) ఆలయంలోని ద్వారపాలకుల విగ్రహాలకు బంగారం మాయమవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఆ కేసులో మొదటి నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టిని క్రైం బ్రాంచ్‌కు చెందిన సిట్ పోలీసులు అరెస్టు చేశారు. బంగారు పూత పూసిన రాగి పలకల నుంచి బంగారం మాయమవడంపై కేరళ హైకోర్టు సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. క్రైం బ్రాంచ్ ఏడీజీపీ హెచ్ వెంకటేశ్ ఆధ్వర్యంలో ఉన్నికృష్ణన్ను విచారిస్తున్నారు. పొట్టి ఇచ్చే వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్నారు.
తిరువనంతపురంలోని పులిమత్తు నుంచి పొట్టిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ద్వారపాలకుల విగ్రహాలకు ఎలక్ట్రోప్లేటింగ్ చేయించడానికి తీసుకెళ్లి వాటి నుంచి గోల్డ్‌ను తీసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉన్నికృష్ణన్ సన్నిహితుడు కల్పేశ్ ఈ కేసులో రెండవ నిందితుడు.
2019లో ట్రావన్కోరు దేవస్థానం బోర్డులో సభ్యులుగా ఉన్న 8 మంది కూడా నిందితులుగా ఉన్నారు. ఉన్నికృష్ణన్ పొట్టికి పర్మనెంట్ ఆదాయం లేదు. కానీ అతను శబరిమలకు లక్షలు విరాళం ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.