హైదరాబాద్, జూలై 25 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): అది కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా. అక్కడ ధర్మస్థల అనే ఓ పుణ్యక్షేత్రం ఉన్నది. పరమశివుడు ఇక్కడ మంజునాథ స్వామిగా భక్తులకు దర్శనమిస్తాడు. ఏటా లక్షలాది మంది భక్తులు సందర్శించే ఈ పుణ్యక్షేత్రం.. మర్డర్ మిస్టరీలకు ఇప్పుడు కేరాఫ్‌గా మారింది. యావత్తు దేశాన్ని విస్మయానికి గురి చేస్తున్న ఈ ఘటన ఓ పారిశుద్ధ్య కార్మికుడు ఇటీవల ఇచ్చిన ఓ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది.
జూలై 3న ఓ న్యాయవాదితో కలిసి ధర్మస్థల పోలీస్ స్టేషన్‌కు ఓ వ్యక్తి వచ్చాడు. ధర్మస్థల ఆలయంలో గతంలో తాను 20 ఏండ్ల పాటు పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసినట్టు పరిచయం చేసుకొన్న అతను.. ఈ సమయంలోనే వందలాది మృతదేహాలను తాను పాతిపెట్టినట్టు పోలీసులకు చెప్పాడు. హతుల్లో టీనేజీ అమ్మాయిలు, చిన్నారులే ఎక్కువగా ఉన్నారని, వారిలో కొందరిపై లైంగిక దాడులు, యాసిడ్ దాడులు కూడా జరిగాయని బాంబు పేల్చాడు. దీంతో షాక్‌కు గురైన పోలీసులు ఆ వ్యక్తి నుంచి పూర్తి వివరాలు సేకరించారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆ వ్యక్తి ఏమన్నాడంటే.. ‘నేను దళితుడిని. ధర్మస్థల ఆలయంలో పారిశుద్ధ్య కార్మికుడిగా 1995 ప్రాంతంలో చేరా. ధర్మస్థల ఆలయానికి సమీపంలో ఉన్న నేత్రావతి నది వద్ద విధులు నిర్వర్తించా. ఆ పరిసరాలను శుభ్రం చేయడం నా డ్యూటీ. అయితే, ఓ రోజు ఆలయానికి సంబంధించిన సూపర్వైజర్ల నుంచి నాకు దారుణమైన ఆదేశాలు అందాయి.
టీనేజీ అమ్మాయిలు, చిన్నారి బాలికల మృతదేహాలను ధర్మస్థల అటవీ ప్రాంతాల్లో పూడ్చిపెట్టాలని వాళ్లు నన్ను బలవంత పెట్టారు. ఈ బాడీలన్నీ నేత్రావతి నదితో పాటు ధర్మస్థల ప్రాంతానికి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలకు సంబంధించినవని నేను భావించా. దీంతో సూపర్వైజర్లు చెప్పినట్టే చేశా. అయితే కొన్ని రోజులకు ఆ మృతదేహాలపై గాయాలు, లైంగిక దాడి జరిగినట్టు తెలిసేలా కొన్ని గుర్తులను గమనించా. కొన్ని బాడీలపై లోదుస్తులు కూడా లేవు. దీంతో ఏదో తప్పు జరుగుతుందని అనుమానించి సూపర్వైజర్లను ప్రశ్నించా. దీంతో వారికి నామీద కోపం వచ్చింది. నన్ను తీవ్రంగా కొట్టారు. తాము చెప్పినట్లు చేయకపోతే నన్ను ముక్కలుగా నరికి చంపేయడమే కాకుండా నా కుటుంబాన్ని కూడా బతకనీయబోమని బెదిరించారు. దీంతో భయపడిపోయిన నేను తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పని కొనసాగించా’ అని ఆ వ్యక్తి చెప్పాడు.
ఇంకా ఆ వ్యక్తి మాట్లాడుతూ.. ‘2010లో పూడ్చిపెట్టిన ఓ బాలిక మృతదేహంపై స్కూల్ యూనిఫాం ఉంది. ఆమెపై అత్యాచారం జరిగినట్టు తెలుస్తున్నది. స్కూల్ బ్యాగ్‌తో పాటే ఆమెను కూడా పూడ్చిపెట్టాలని నాతో సూపర్వైజర్లు చెప్పారు. ఇక, 20 ఏండ్ల వయసున్న మరో యువతిని రేప్ చేసి చంపేసినట్టు గమనించా. ఆమె ముఖంపై యాసిడ్ పోశారు. ఆమె ఆనవాళ్లు దొరకవద్దని ఆమెకు సంబంధించిన చెప్పులు, ఇతర వస్తువులను అన్నింటినీ డెడ్‌బాడీతో పాటే పూడ్చేయమన్నారు.
ఆనవాళ్లు దొరకవద్దని మరికొందరిని పెట్రోల్‌తో కూడా కాల్చేవారు. 20 ఏండ్ల వ్యవధిలో బాలికలు, యువతులతో పాటు గొంతు కోయడంతో చనిపోయిన కొందరు పురుషుల మృతదేహాలు కూడా తీసుకువెళ్లి పాతిపెట్టి వచ్చా. నన్ను, నా కుటుంబాన్ని ఏం చేస్తారోనన్న భయంతోనే 2014 వరకు ఈ పని చేశా. అయితే, 2014 డిసెంబర్లో సూపర్వైజర్లకు సన్నిహితుడైన ఒకడి కన్ను మైనర్ బాలిక అయిన మా కుటుంబ సభ్యురాలిపై పడింది. ఆమెపై అతను వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ధర్మస్థలను వదిలి కుటుంబంతో సహా పారిపోయా. ఇతర రాష్ర్టాల్లో తలదాచుకున్నా. అయితే, నేను చేసిన అపరాధ భావం నన్ను వెంటాడుతూనే ఉంది. దీంతో జరిగిన దారుణాలను బయటకు చెప్పాలని ఇప్పుడు తిరిగి వచ్చా.
నేను చెప్తున్నది నిజమని నిరూపించడానికి దేనికైనా సిద్ధమే. బ్రెయిన్ మ్యాపింగ్, పాలిగ్రాఫీ లాంటి టెస్టులకు కూడా సిద్ధమే. నేను పాతిపెట్టిన ప్రాంతాలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయ’ని ఆ వ్యక్తి పేర్కొన్నాడు. ధర్మస్థల సమీపంలో గతంలో తాను పాతిపెట్టిన ఓ బాధితురాలి పుర్రె ఫొటోలను కూడా తన కైంప్లెంట్తో పాటు ఆ వ్యక్తి పోలీసులకు సమర్పించాడు. తనకు, తన కుటుంబానికి తగిన భద్రత కల్పిస్తే.. సూపర్వైజర్ల పేర్లు కూడా చెప్తానని అన్నాడు. కాగా, కార్మికుడి ఫిర్యాదుతో.. తమ వారిని కోల్పోయిన బాధితుల కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్‌ను ఆశ్రయిస్తున్నారని అధికారి ఒకరు తెలిపారు.
కార్మికుడి ఫిర్యాదును తీసుకొన్న పోలీసులు కేసు నమోదు చేశారు. హక్కుల కార్యకర్తల డిమాండ్ల నేపథ్యంలో కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం డీజీపీ ప్రణబ్ మోహంతీ నేతృత్వంలో 20 మంది అధికారులతో ఓ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. సిట్ విచారణకు అన్ని విధాలుగా సహకరిస్తామని ఆలయ అధికారులు పేర్కొన్నారు. పారదర్శక దర్యాప్తుతో నిజాలన్నీ బయటకు రావాలని కోరుకొంటున్నట్టు తెలిపారు. కాగా, ధర్మశాల ఆలయ నిర్వహణ బాధ్యతలను హెగ్డే కుటుంబీకులు శతాబ్దాలుగా చూస్తూ వస్తున్నారు. రాజ్యసభ ఎంపీ, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత వీరేంద్ర హెగ్డే ఈ ఆలయానికి 21వ ధర్మాధికారిగా వ్యవహరిస్తున్నారు. 1968 నుంచి ఆయన ఈ పదవిలో కొనసాగుతున్నారు. కాగా, 2022లో బీజేపీ నుంచి వీరేంద్ర హెగ్డేను ప్రధాని నరేంద్ర మోదీ ఎంపీగా నామినేట్ చేయడం తెలిసిందే.
ధర్మస్థలలో మిస్టరీ మరణాలు కొత్తేంకాదు. 2012లో ధర్మస్థలలో సౌజన్య అనే 17 ఏండ్ల యువతి అనుమానస్పద స్థితిలో మరణించడం సంచలనంగా మారింది. ఆమెపై అత్యాచారం జరిగినట్టు ఫోరెన్సిక్ నివేదికలో తేలింది. ధర్మస్థల ఆలయ నిర్వాహకులకు సంబంధించిన వ్యక్తులే ఈ దారుణానికి పాల్పడ్డారని సౌజన్య కుటుంబీకులు ఆరోపించారు. ‘జస్టిస్ ఫర్ సౌజన్య’ పేరిట హక్కుల కార్యకర్తలు పెద్దయెత్తున ఆందోళనలు చేపట్టారు. ఇక, 1987లో పద్మలత (17) హత్యాచారం, 2003లో అనన్యభట్ అనే మెడికల్ స్టూడెంట్ మిస్సింగ్ ఘటనలు కూడా ధర్మశాలలో తీవ్ర కలకలం సృష్టించాయి.