న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో కస్టడీలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు మనీశ్ సిసోడియాను సీబీఐ మానసికంగా హింసిస్తున్నదని ఆ పార్టీ నేతలు సౌరభ్ భరద్వాజ్, అతిషి ఆరోపించారు. తప్పుడు అంగీకార ప్రకటనపై సంతకం చేయాలని సీబీఐ అధికారులు సిసోడియాపై ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. సిసోడియాపై ఎటువంటి అవినీతి ఆరోపణలను రుజువు చేయలేకపోయిన సీబీఐ ఇప్పుడు ఆయనను తప్పు ఒప్పుకోమంటూ మానసికంగా వేధిస్తున్నదని విమర్శించారు.
తమ రాజకీయ బాస్‌లను మెప్పించేందుకే సీబీఐ సిసోడియాను అరెస్టు చేసిందని దుయ్యబట్టారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో జరుగుతున్న విచారణలో సిసోడియా తమకు సహకరించడం లేదంటూ సీబీఐ అధికారులు ఆయనను గత నెల 26న అరెస్టుచేశారు. ప్రత్యేక కోర్టు సిసోడియాకు విధించిన కస్టడీని సోమవారం సాయంత్రం వరకూ పొడిగించింది.
సీబీఐ దాఖలుచేసిన మొదటి చార్జిషీట్లో, ఆ తరువాత దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీట్లో కూడా సిసోడియా పేరు లేనేలేదని అతిషి తెలిపారు. బీజేపీ నేతలు చేసిన తప్పుడు ఆరోపణల కారణంగానే మనీశ్ సిసోడియా మానసిక వేధింపులను ఎదుర్కొంటున్నారని, దేశ ప్రజలంతా దీనిని గమనిస్తున్నారని అతిషి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, తనను పదే పదే అడిగిన ప్రశ్నలే అడిగి, మానసికంగా వేధిస్తున్నారని శనివారం సిసోడియా న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నిందితుడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించవద్దని, కొత్త ప్రశ్నలేమైనా ఉంటేనే అడగమని జడ్జి సీబీఐని ఆదేశించారు.
అదానీ చేతుల్లోకి దేశ సంపద: కేజ్రీవాల్
మోదీ, అదానీది విడదీయలేని బంధమని, అందుకే దేశ సంపదను ప్రధాని మోదీ కార్పొరేట్ అదానీకి దోచిపెడుతున్నారని ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆదివారం ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్‌లో జరిగిన ఆప్ కార్యకర్తల ర్యాలీలో కేజ్రీవాల్ మాట్లాడారు.
బీజేపీ, కాంగ్రెస్.. దొందూదొందే: సౌరభ్
కాంగ్రెస్, బీజేపీ రెండు ఒకే కోవకు చెందిన పార్టీలని, దేశంలో ఇతర రాజకీయ పార్టీలు ఉండకూదని ఆ రెండు పార్టీలు కోరుకుంటున్నాయని ఆప్ ప్రధాన అధికార ప్రతినిధి సౌరబ్ భరద్వాజ్ విమర్శించారు. మనీశ్ సిసోడియా అరెస్టును నిరసిస్తూ ప్రధానికి లేఖ రాసిన పార్టీల జాబితాలో కాంగ్రెస్ లేని నేపథ్యంలో సౌరభ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
సిబల్ ‘ఇన్సాఫ్’కు కేజ్రీవాల్ మద్దతు
రాజ్యసభ ఎంపీ, న్యాయవాది కపిల్ సిబల్ ప్రారంభించిన ‘ఇన్సాఫ్’కు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మద్దతు తెలిపారు. అన్యాయంపై పోరాడేందుకు ప్రతి ఒక్కరూ ఈ వేదికలో చేరాలని ఆదివారం ట్విట్టర్ వేదికగా అభ్యర్థించారు. దేశంలో జరుగుతున్న అన్యాయంపై పోరాడేందుకు ‘ఇన్సాఫ్’ వేదికను ఏర్పాటు చేస్తున్నట్టు కపిల్ సిబల్ శనివారం ప్రకటించారు. ముఖ్యమంత్రులు, విపక్ష నేతలు తనకు మద్దతుగా నిలువాలని కోరారు. ‘కపిల్ సిబల్ చాలా ముఖ్యమైన చొరవ తీసుకొన్నారు. ఇన్సాఫ్‌లో చేరాలని అందరినీ అభ్యర్థిస్తున్నా. అంతా కలిసి అన్యాయంపై పోరాటం చేద్దాం’ అని కేజ్రీవాల్ అన్నారు.