న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ గురించి ఇవాళ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఎన్నికల సంఘం మీడియా సమావేశాన్ని నిర్వహించింది. చీఫ్ ఎలక్షన్ కమీషనర్ జ్ఞానేశ్ కుమార్(CEC Gyanesh Kumar) మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. 243 స్థానాలు ఉన్న బీహార్ రాష్ట్ర అసెంబ్లీ కాలపరిమితి ఈ ఏడాది నవంబర్ 22న ముగియనున్నది. 2020లో మూడు దశల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టిన తర్వాత జరుగుతున్నతొలి ఎన్నికలు ఇవే. సిర్లో భాగంగా బీహార్‌లో 68.5 లక్షల ఓటర్లను తొలగించారు. 21. 5 లక్షల మంది కొత్త ఓటర్ల పేర్లను జాబితాలో కలిపారు.
బీహార్‌లో మొత్తం 7.42 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. ఎన్నికల ప్రక్రియను మరింత సులభతరం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. నామినేషన్లకు పది రోజుల ముందు కూడా ఓటర్లు మార్పులు చేసుకోవచ్చు అని ఆయన సూచించారు. ఎన్నికలకు సంబంధించిన తుది ఓటరు జాబితాను ప్రకటించామని, ఒకవేళ ఎవరైనా అప్పీల్ చేసుకోవాలనుకుంటే, నామినేషన్‌కు పది రోజుల ముంద వరకు చేసుకోవచ్చు అని సీఈసీ తెలిపారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేశామని జ్ఞానేశ్ చెప్పారు. ఓటర్లకు వీలైన రీతిలో ఎన్నికలు నిర్వహిస్తున్నామని, రాష్ట్రంలో శాంతి,భద్రతల పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు చెప్పారు. 7.43 కోట్ల మంది బీహారీ ఓటర్లలో .. 3.92 కోట్ల మంది పురుష, 3.51 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు సీఈసీ తెలిపారు. ఫస్ట్ టైం ఓటర్లు 14 లక్షలు ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
సిర్ ప్రక్రియ ద్వారా బీహార్ ఓటర్ల జాబితాను పరిశుభ్రం చేసినట్లు చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలు, వ్యక్తులను అభ్యంతరాలను దాఖలు చేయాలని కోరామని,ఆ తర్వాత ముసాయిదాను పబ్లిష్ చేశామన్నారు. సెప్టెంబర్ 30వ తేదీన తుది ఓటర్ల జాబితాను వెల్లడించినట్లు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తెలిపారు.