Simla Agreement | న్యూఢిల్లీ: కశ్మీర్ విషయంలో మూడో పక్షం జోక్యం ఉండరాదనే సిమ్లా ఒప్పందం స్ఫూర్తికి కేంద్రంలోని బీజేపీ సర్కారు తూట్లు పొడిచిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 1971 భారత్ పాక్ యుద్ధంలో పాక్ శరణాగతి తర్వాత 1972 జులై 2న హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో ఇరు దేశాల ప్రధానులు సమావేశమై ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. దీన్నే చారిత్రక సిమ్లా ఒప్పందంగా పిలుస్తారు. దీని ప్రకారం భారత్ పాక్ మధ్య తలెత్తే ఏ విబేదమైనా, వివాదమైనా శాంతియుత వాతావరణంలో ద్వైపాక్షిక చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలి. ఇందులో మూడో దేశం లేదా వ్యక్తుల ప్రమేయం లేదా బాగస్వామ్యం కానీ అంగీకరించరాదు. ఇరు దేశాల నాయకులు దీనికి అంగీకరించి సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం కారణంగానే కశ్మీర్ సమస్య అంశంలో ఇంతవరకూ ఏనాడూ ఐక్యరాజ్య సమితితో పాటు ఏ దేశమూ జోక్యం చేసుకోలేదు. తాజాగా అమెరికా అధ్యక్షుడి ప్రకటనతో కశ్మీర్ వివాదాన్ని అంతర్జాతీయ సమాజం ముందు పెట్టినట్టయింది. భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటన చేయడం, అందులో కశ్మీర్ వివాదం పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహిస్తానని పేర్కొనడం ఏడు దశాబ్దాల భారత దౌత్య విధానానికి తీవ్ర విఘాతమని విద్యావేత్తలు మేధావులు అంటున్నారు. ప్రతిపక్షాలు ట్రంప్ ప్రకటనపై తీవ్రంగా మండిపడుతున్నాయి. ఇది మన దేశ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకోవడమేనని, మన సార్వభౌమత్వాన్ని అమెరికాకు తాకట్టు పెట్టడమేనని అంటున్నాయి. దశాబ్దాల తరబడి భారత్ నెరిపిన దౌత్యనీతిని మోదీ మంటగలుపుతున్నారని ధ్వజమెత్తుతున్నాయి. ఈ విషయమై వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, లేదా పార్లమెంట్ ప్రత్యేక సమావేశం నిర్వహించి కేంద్రం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.
అసలేమిటీ సిమ్లా ఒప్పందం?
భారత్, పాకిస్థాన్ మధ్య 1971 యుద్ధం, బంగ్లాదేశ్ అవతరణ అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు సడలించి స్నేహపూర్వక సంబంధాలు ఏర్పరిచే లక్ష్యంతో 1972 జులై 2న హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందంపై ఆనాటి భారత ప్రధాని ఇందిరా గాంధీ, పాకిస్థాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో సంతకాలు చేశారు. ఇరు దేశాల పార్లమెంట్లలో ఆమోదం పొందిన తర్వాత అదే ఏడాది ఆగస్టు 4వ తేదీ నుంచి ఈ ఒప్పందం అమలులోకి వచ్చింది. ఇరు దేశాలు కాల్పుల విరమణ పాటించాలని, భవిష్యత్తులో ఏవైనా విభేదాలు తలెత్తినా వాటిని శాంతియుతంగా, ద్వైపాక్షిక చర్చలు, పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవాలని, అందులో మూడో పక్షం జోక్యానికి అవకాశం ఇవ్వకూడదనేది ఈ ఒప్పందం ప్రధానాంశం. అమెరికా అధ్యక్షుడి ప్రకటన, దానిపై భారత్ మౌనం నేపథ్యంలో సిమ్లా ఒప్పందం స్ఫూర్తికి మోడీ ప్రభుత్వం మంగళం పాడినట్టేనా? అనేది ప్రశ్న తలెత్తుతుంది.