న్యూఢిల్లీ, జనవరి 12: గిగ్ వర్కర్లకు భారీ ఊరట. 10 నిమిషాల్లో డెలివరీ చేయాలన్న నిబంధనను నిలిపివేసేందుకు క్విక్ కామర్స్ సంస్థలు అంగీకరించాయి. ఈ నిబంధనపై ఇటీవల గిగ్ వర్కర్లు దేశవ్యాప్తంగా సమ్మెకు దిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు జోక్యం చేసుకున్నది. వస్తువుల డెలివరీ సమయపాలనకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర కార్మిక మంత్రి మాన్సుఖ్ మాండవీయ మంగళవారం బ్లింకిట్, జెప్టో, జొమాటో, స్విగ్గీసహా ప్రధాన డెలివరీ ప్లాట్‌ఫామ్‌లతో సమావేశమయ్యారు.
వస్తువుల డెలివరీలపై 10 నిమిషాల తప్పనిసరి సమయపాలన నిబంధనను తొలగించాలని ఆ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లను ఆయన ఒప్పించారు. తన బ్రాండింగ్ నుంచి 10 నిమిషాల డెలివరీని తొలగించడానికి బ్లింకిట్ ఇప్పటికే అంగీకరించింది. 10 నిమిషాల్లో 10,000 పైచిలుకు ఉత్పత్తుల డెలివరీ అన్న ట్యాగ్‌లైన్ స్థానంలో మీ గుమ్మం వద్దకే 30,000 పైచిలుకు ఉత్పత్తుల డెలివరీగా బ్లింకిట్ మార్చింది. రానున్న రోజుల్లో ఇతర ప్లాట్‌ఫారాలు కూడా దీన్ని అనుసరించవచ్చు. గిగ్ కార్మికులకు మరింత సురక్షితమైన, భద్రతతోకూడిన, మెరుగైన పని పరిస్థితులను కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది.
ఇటీవలి కాలంలో గిగ్ వర్కర్ల సంక్షేమంపై విస్తృతంగా చర్చ జరుగుతున్నది. తీవ్రమైన ఒత్తిడితో, కఠినమైన వాతావరణ పరిస్థితులలో పనిచేస్తున్న గిగ్ వర్కర్ల దుస్థితి గురించి ఇటీవలి పార్లమెంట్ సమావేశాలలో ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా ప్రస్తావించారు. గిగ్ కార్మికులకు ప్రత్యేక సామాజిక భద్రతా ప్రయోజనాలు, మర్యాద, రక్షణ, న్యాయమైన వేతనం లభించేందుకు వీలుగా క్విక్ కామర్స్, ఇతర యాప్ ఆధారిత డెలివరీ వ్యాపారాలపై నియంత్రణలు అవసరమని చద్దా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.