అమృత్సర్ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూకు మద్దతుగా ఆయన కుమార్తె రబియా సిద్ధూ అమృత్‌సర్‌లో ప్రచారం చేశారు. తన తండ్రి గెలుపొందే వరకూ తాను వివాహం చేసుకోనని ఆమె ప్రతిన బూనారు. కాంగ్రెస్ సీఎం అభ్యర్ధి, పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీపై రబియా సిద్ధూ విమర్శలు గుప్పించారు. తాను పేదవాడినని చెబుతున్న చన్నీ వ్యాఖ్యలపై ఆమె సందేహం వ్యక్తం చేశారు. చన్నీ నిజంగా పేదవాడా..ఆయన బ్యాంకు ఖాతాలు చూస్తే రూ . 133 కోట్లకు పైగా మూలుగుతుంటాయని అన్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తన తండ్రిని సీఎం అభ్యర్ధిగా కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించకపోవడం, సిద్ధూను పక్కనపెట్టడం పట్ల ఆమె అసహనానికి లోనయినట్టు కనిపించింది.
కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి వేరే ఒత్తిళ్లు ఉండవచ్చు..అయినా నిజాయితీతో కూడిన వ్యక్తిని ఎంతోకాలం తొక్కిపెట్టలేరని ఆమె వ్యాఖ్యానించారు. గత 14 ఏండ్లుగా పంజాబ్ కోసం తన తండ్రి కష్టపడుతున్నారని, రాష్ట్రానికి నూతన మోడల్‌ను కనుగొన్న ఆయనను గౌరవించాలని అన్నారు. తన తండ్రితో చన్నీకి అసలు పోలికే లేదని పరోక్షంగా సీఎంను ఎద్దేవా చేశారు. దయనీయ పరిస్ధితిలో ఉన్న పంజాబ్‌ను కేవలం తన తండ్రి సిద్ధూ ఒక్కరే కాపాడగలరని అన్నారు. పంజాబ్ డ్రగ్ మాఫియా, ఇసుక మాఫియా సహా ప్రతిఒక్కరూ సిద్ధూను తొక్కివేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె మండిపడ్డారు. అమృత్‌సర్‌లో తన తండ్రిపై పోటీ చేస్తున్న శిరోమణి అకాలీదళ్ నేత విక్రం సింగ్ మజితియాపైనా ఆమె ఆరోపణలు గుప్పించారు.
అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ బావమరిది మజితియాకు డ్రగ్ మాఫియాతో సంబంధాలున్నాయని, డ్రగ్ మాఫియా కావాలో, అభివృద్ధి కావాలో అమృత్సర్ ఓటర్లు తేల్చుకోవాలని ఆమె కోరారు. ఇక ఈనెల 20న ఒకే దశలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. ఈ ఎన్నికల్లో మరోసారి గెలుపొంది అధికార పగ్గాలు చేపట్టాలని పాలక కాంగ్రెస్ సన్నద్ధమవగా, ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకుని అందలం ఎక్కాలని అరవింద్ కేజ్రీవాల్ సారధ్యంలోని ఆప్ సర్వశక్తులు ఒడ్డుతోంది. సాగు చట్టాలపై పోరుతో ఊపుమీదున్న అకాలీదళ్, కెప్టెన్ సింగ్‌తో జోడీతో బలపడిన బీజేపీలు ప్రధాన పార్టీలకు దీటైన పోటీ ఇచ్చేందుకు కసరత్తు సాగిస్తున్నాయి.