అమృత్సర్ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఎస్ఏడీ, పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్సీ)పై తీవ్రస్ధాయిలో విమర్శలు గుప్పించారు. ఇరు పార్టీల నేతలు ఒకే నాణేనికి రెండు వైపుల వంటి వారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు మార్పు తీసుకురావాలనుకుంటే తనను ఉద్దేశించి ఈ వ్యక్తికి ఓటు వేయండని అభ్యర్ధించారు. కెప్టెన్ అమరీందర్ సింగ్, సుఖ్బీర్ సింగ్ బాదల్లు ఒకే నాణేనికి రెండు వైపుల వంటి వారని, వారివైపు మొగ్గితే తిరోగమనమేనని హెచ్చరించారు.
సిద్ధూ అమృత్‌సర్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. అంతకుముందు అమృత్సర్ ఈస్ట్‌లో సిద్ధూకు అనుకూలంగా పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ ప్రచారం చేశారు. ఈ ఎన్నికల్లో సిద్ధూపై ఎస్ఏడీ అభ్యర్ధిగా విక్రం సింగ్ మజితియాను బరిలో నిలిపింది. పంజాబ్ సీఎం అభ్యర్ధిగా కాంగ్రెస్ హైకమాండ్ చన్నీకి సీఎం అభ్యర్ధిత్వం కట్టబెట్టింది. ప్రజాభిప్రాయం చన్నీకి అనుకూలంగా రావడంతో పాటు పంజాబ్‌లో దళిత జనాభా 30 శాతం దాటడంతో దళితులను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ దళిత నేత చన్నీవైపు మొగ్గుచూపింది.
సీఎం అభ్యర్ధిత్వం దక్కకపోవడంతో పార్టీ సీనియర్ నేత, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కినుక వహించారు. ఇక ఫిబ్రవరి 20న ఒకే దశలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం పాలక కాంగ్రెస్ పావులు కదుపుతుండగా, ప్రభుత్వ వ్యతిరేకతతో గట్టెక్కాలని ఆప్ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ప్రధాన పార్టీలకు దీటైన పోటీ ఇచ్చేందుకు బీజేపీ-పీఎల్సీ కూటమి, ఎస్ఏడీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి.