చండీఘఢ్ : పంజాబ్‌లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తే ఐదు లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఉద్యోగాలు ఇవ్వకుంటే తాను రాజకీయాల నుంచి వైదొలగుతానని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ స్పష్టం చేశారు. పేదల సంక్షేమం కోసం 13 సూత్రాల కార్యక్రమాన్ని ముందుకు తెచ్చామని పఘ్వారా ఎమ్మెల్యే బల్వీందర్ సింగ్ ధలివాల్ ఏర్పాటు చేసిన ర్యాలీలో సిద్ధూ తెలిపారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు లక్షల ఉద్యోగాలను అందుబాటులోకి తీసుకురాకుంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సిద్ధూ పునరుద్ఘాటించారు. రాజకీయ ప్రత్యర్ధులను బీజేపీలో చేరాలని, కాషాయ పార్టీలో చేరని పక్షంలో వారిపై కేంద్ర దర్యాప్తు సంస్ధలచే దాడులు చేపతామని బెదిరిస్తున్నారని కమలనాధులపై సిద్ధూ విమర్శలు గుప్పించారు.
రైతుల నుంచి ప్రతిఘటన ఎదురువుతందనే భయంతో జలంధర్‌లో బీజేపీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం లేదని సిద్ధూ ఎద్దేవా చేశారు. ఆప్, ఎస్ఏడీలు అసెంబ్ల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రజలకు లాలీపాప్‌లు ఆఫర్ చేస్తున్నాయని విమర్శించారు. 22,000 మంది ఉపాధ్యాయులు ఢిల్లీలో రోడ్డునపడితే వారి సమస్యలను ఆలకించేందుకు సీఎం ప్రయత్నించడం లేదని, వారి గొంతు వినేందుకు కూడా ఢిల్లీ సీఎం సిద్ధంగా లేరని సిద్ధూ అన్నారు.