బెంగళూరు అక్టోబర్ 22: కర్ణాటకలో నాయకత్వ మార్పు జరుగుతుందని పెద్ద ఎత్తున ఊహాగానాలు సాగుతున్న వేళ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) కుమారుడు, కాంగ్రెస్ ఎంఎల్సీ యతీంద్ర బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి రాజకీయ జీవితం చివరి దశలో ఉందని, తన క్యాబినెట్ సహచరుడు సతీశ్ జార్ఖిహోళికి ఆయన మార్గదర్శిగా ఉండాలని యతీంద్ర సూచించారు. బెళగావిలో బుధవారం ఓ కార్యక్రమానికి జార్ఖిహోళితో కలసి హాజరైన యతీంద్ర తండ్రి తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే వ్యక్తి గురించి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.
మా నాన్న రాజకీయ జీవితం చివరి దశలో ఉంది. ఈ దశలో బలమైన సిద్ధాంతం, ప్రగతిశీల భావాలు గల ఓ నాయకుడికి ఆయన మార్గదర్శిగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను పరిరక్షించి, పార్టీని సమర్థవంతంగా నడపగల సత్తా జార్ఖిహోళికి ఉంది. అటువంటి సైద్ధాంతిక నిబద్ధత గల నాయకుడిని కనుగొనడం చాలా అరుదని నేను విశ్వసిస్తాను. ఆయన తన మంచి పనులు కొనసాగిస్తారని ఆశిస్తున్నాను అంటూ తన తండ్రి తర్వాత ముఖ్యమంత్రిగా జార్ఖిహోళికి అవకాశం ఇవ్వాలని యతీంద్ర పరోక్షంగా పార్టీ అధినాయకత్వానికి సూచించారు.
కర్ణాటకలో గత కొంతకాలంగా నాయకత్వ మార్పుపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. అధిష్టానానిదే తుది నిర్ణయమని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బయటకు చెబుతున్నప్పటికీ తెరవెనుక రాజకీయాలు మాత్రం ఆగడం లేదు. ఐదేళ్ల పూర్తి పదవీకాలం తానే కొనసాగుతానని సిద్ధరామయ్య పలుసార్లు స్పష్టం చేయగా డీకే మద్దతుదారులు మాత్రం అధిష్టానవర్గం వద్ద కుదిరిన ఒప్పందం ప్రకారం రెండున్నరేళ్ల పదవీకాలం తర్వాత సిద్ధరామయ్య వైదొలగి ముఖ్యమంత్రిగా డీకే బాధ్యతలు చేపడతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన ఓ పరిణామం నాయకత్వ మార్పు ఊహాగానాలకు మరింత బలం చేకూర్చే విధంగా ఉంది.
కాంగ్రెస్ ఎంపీ ఎల్ఆర్ శివరామే గౌడ ఇటీవల పార్టీ అధినాయకత్వాన్ని కలసి రాష్ట్రంలో ఏర్పడిన గందరగోళంపై స్పష్టత తీసుకున్నారు. డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావడంలో ఎటువంటి అనుమానం లేదని, కాని తుది నిర్ణయం అధిష్టానం చేతిలో ఉందని గౌడ చెప్పారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మధ్య సమతుల్యం ఎలా సాధించాలో, పార్టీని ఎలా నిలబెట్టుకోవాలో పార్టీ అధిష్టానానికి తెలుసునని, ఏదేమైనా కష్టానికి ఎప్పటికైనా ప్రతిఫలం ఉంటుందని గౌడ తేల్చేశారు. దీంతో డీకే సీఎంగా అధికార పీఠం ఎక్కడం ఖాయమన్న నమ్మకం ఆయన మద్దతుదారులలో బలపడింది. ఇప్పుడు స్వయంగా సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర చేసిన వ్యాఖ్యలతో త్వరలోనే నాయకత్వ మార్పు అనివార్యంగా కనపడుతోంది.